‘లవ్ స్టోరీ’ పవన్ ఎవరి కొడుకో తెలుసా?

- Advertisement -


సంగీత దర్శకుడు కొడుకులు సంగీత దర్శకుడిగా అడుగుపెట్టడం చూశాం. కెమెరామెన్ కొడుకు కొడుకు కెమెరామెన్ కావడం తెలుసు. కానీ, కెమెరామెన్ కొడుకు మ్యూజిక్ డైరెక్టర్ గా మారడం అరుదు. శేఖర్ కమ్ముల సినిమాలకు రెగ్యులర్ గా సినిమాటోగ్రాఫర్ గా పనిచేసే విజయ్ కుమార్ కొడుకు పవన్ సంగీత దర్శకుడు అయ్యాడు. అతనే …. సూపర్ హిట్ “సారంగ దారియా” పాటకు సంగీతం ఇచ్చాడు.

శేఖర్ కమ్ముల తాజా చిత్రం “లవ్ స్టోరీ”తో అతను సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తండ్రి ఆ సినిమాకి కెమెరా వర్క్ అందిస్తే… కుమారుడు పాటలు ఇచ్చాడు.

“మాది సినిమా ఫ్యామిలీ. మా నాన్నగారు విజయ్, తాతగారు సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేశారు. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్. అలా చదువులు పూర్తయ్యాక మ్యూజిక్ అకాడెమీలో సంగీతం నేర్చుకున్నాను. ఒక సంగీత విభావరిలో రెహమాన్ గారు నా పాటలు విని, వచ్చి కలవమని అన్నారు. నా సంగీతం, కంపోజిషన్ ఆయనకు బాగా నచ్చాయని చెప్పి సహాయకుడిగా పెట్టుకున్నారు. అలా రెహమాన్ గారితో శివాజీ, రోబో, సర్కార్ తదితర చిత్రాలకు పనిచేశాను,” అని పవన్ తన ప్రయాణం ఎలా మొదలైందో వివరించాడు.

“ఫిదా టైంలోనే ఆయనకు నా ట్యూన్స్ వినిపించాను. ఆయనకి అవి నచ్చాయి. కానీ ఆ సినిమా తనకి చాలా ఇంపార్టెంట్ అని, కొత్తవాళ్లతో రిస్క్ చేయలేనని చెప్పి వద్దన్నారు. “లవ్ స్టోరీ” తీస్తున్నప్పుడు పిలిచి అవకాశం ఇచ్చారు. ముందు కొన్ని సందర్భాలు చెప్పి ట్యూన్స్ చేయమన్నారు. ఆ తర్వాత నువ్వు సినిమాకు పనిచేస్తున్నావు అని చెప్పారు. అలా ఫస్ట్ ఆఫర్ వచ్చింది,” అని చెప్పారు.

“లవ్ స్టోరీ” పాటలు ఇన్ని మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం కొత్త సంగీత దర్శకుడిగా చాలా సంతృప్తిగా ఉంది అంటున్నారు పవన్ సి.ఎచ్.

 

More

Related Stories