
‘లవ్ స్టోరి’ సినిమా సక్సెస్ సంబరాలు ఈ రోజు హైదరాబాద్ లో సింపుల్ గా జరిగాయి. ఈ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథిగా వచ్చారు. తెలుగు సినిమా రంగానికి ‘లవ్ స్టోరి’ విజయం ఒక ఊపు ఇచ్చిందన్నారు నాగ్. కరోనా కష్టకాలంలో తెలంగాణ, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి సరైన నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు నాగార్జున. అలాగే, ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగు సినిమాపై చల్లని చూపు వెయ్యాలని కోరారు.
ఇక తన కొడుకుని స్టార్ యాక్టర్ గా చేసినందుకు దర్శకుడు శేఖర్ కమ్ములకి థాంక్స్ చెప్పారు నాగార్జున. “జనరల్ గా యాక్టర్, స్టార్ వేర్వేరు. కానీ మావాడిని స్టార్ యాక్టర్‌గా చేశారు దర్శకుడు. అతన్ని న్యూ జర్నీలో తీసుకెళ్లావు శేఖర్,” అంటూ నాగార్జున కమ్ములని అభినందించారు.
కొడుకుపై కూడా ప్రశంసలు కురిపించారు. “నాన్న… నువ్వు చాలా ఫెంటాస్టిక్ గా నటించావు. నేను నవ్వేలా, ఏడ్చేలా చేశావు సినిమాలో,” అంటూ చైతన్యని మెచ్చుకున్నారు.
సాయి పల్లవి డ్యాన్స్ ఒక మేజిక్ అని పొగిడారు. “సాయి పల్లవి డాన్స్ చేస్తుంటే ఆమె చుట్టూ వంద సాయి పల్లవిలు డాన్స్ చేస్తున్నట్లు ఉంటుంది. ఆమె కాళ్లు గాలిలో తేలినట్లు ఉంటాయి. ఆమె ఏ క్యారెక్టర్ చేసినా ఆ మ్యాజిక్ కనిపిస్తుంటుంది. అది గొప్ప గిఫ్ట్,” అని నాగార్జున సాయి పల్లవిని కూడా ప్రశంసలతో ముంచెత్తారు.