లవ్ స్టోరీ – తెలుగు రివ్యూ

Love Story

శేఖర్ కమ్ముల నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్ మెంటల్లీ ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే కమ్ముల మార్క్ ఏంటనేది అప్పుడెప్పుడో వచ్చిన ఆనంద్ నుంచి మూడేళ్ల కిందటొచ్చిన ఫిదా వరకు అందరికీ తెలుసు కాబట్టి. ఎప్పట్లానే లాంగ్ గ్యాప్ తీసుకొని ఈసారి లవ్ స్టోరీతో ప్రేక్షకులముందుకొచ్చాడు కమ్ముల. అయితే ఇది అందరూ అనుకున్నట్టు కేవలం ”లవ్ స్టోరీ” కాదు… అంతకుమించి. శేఖర్ కమ్ముల తన రెగ్యులర్ స్టయిల్ దాటి కాస్త ముందుకొచ్చి తీసిన సినిమా ఇది.

ఫిదా టైపులోనే లవ్ స్టోరీలో కూడా ఓ పోర్షన్ తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్ (ఆర్మూర్-నిజామాబాద్ జిల్లా) లోనే నడుస్తుంది. కానీ ఫిదా టైపులో ఇది రొమాంటిక్ డ్రామా ఎంతమాత్రం కాదు, హీరోహీరోయిన్ల ఇగో సమస్యలు, ఒకర్నొకరు తప్పుగా అర్థం చేసుకోవడాలు ఇందులో ఉండవు. సమాజంలో పాతుకుపోయిన రెండు సీరియస్ ఇష్యూస్ ను ఇందులో టచ్ చేశాడు దర్శకుడు. అందరికీ తెలిసినప్పటికీ పెద్దగా పట్టించుకోని సమస్యలు ఇవి.

ముందుగా కథ విషయానికొద్దాం.. రేవంత్ (నాగచైతన్య) ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వస్తాడు. జుంబా ట్రైనింగ్ సెంటర్ పెడతాడు. దాన్ని పెద్ద డాన్స్ స్టుడియోగా మార్చాలనేది అతడి కల. దానికోసం స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. సరిగ్గా అదే టైమ్ లో రేవంత్ ఊరి నుంచే ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది మౌనిక (సాయిపల్లవి). ఒక టైమ్ లో తన డాన్స్ చూసి ఫిదా అవుతాడు రేవంత్. ఆమెను తన డాన్స్ పార్టనర్ గా చేసుకోవాలనుకుంటాడు. అటు మౌనికకు కూడా ఉద్యోగం దొరక్కపోవడంతో, రేవంత్ ఆఫర్ కు ఓకె చెబుతుంది.

చాలా ఫాస్ట్ గా ఇద్దరూ ప్రేమలో పడిపోతారు. కానీ మౌనిక కులం తెలిసిన తర్వాత రేవంత్ వెనక్కి తగ్గుతాడు. పటేల్ కూతురుకి ప్రపోజ్ చేయడానికి జంకుతాడు. మౌనిక మాత్రం తన మనసులో ఉన్న ప్రేమను బయటపెడుతుంది. అలా ఇద్దరూ ప్రేమలో పడిపోతారు. అయితే ఆర్మూరులో ఉన్న మౌనిక బాబాయ్ నరసింహ (రాజీవ్ కనకాల) ప్రేమను ఒప్పుకోడని భావించి ఇద్దరూ లేచిపోవడానికి రెడీ అవుతారు. సరిగ్గా అక్కడే వాళ్ల ప్లాన్ డిస్టర్జ్ అవుతుంది. పెళ్లి చేసుకొని ఎక్కడికయినా పారిపోవాలని అనుకున్న రేవంత్, మౌనిక ఎందుకు ఆగిపోయారు? ఆ తర్వాత ఏం జరిగింది? బాబాయ్ ను చూసిన ప్రతిసారి మౌనిక ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది? అనేది బ్యాలెన్స్ కథ.

దర్శకుడు కమ్ముల ముందుగానే అసలు మేటర్ ను ఎస్టాబ్లిష్ చేశాడు. అణగారిన కులానికి చెందిన కుర్రాడు, అగ్రకులానికి చెందిన అమ్మాయిని పరిచయం చేశాడు. బాబాయ్ ను చూసిన ప్రతిసారి హీరోయిన్ అసహ్యహించుకుంటుంది, మూర్ఛపడిపోతుంది. అలా ఎందుకనే విషయాన్ని తర్వాత రివీల్ చేస్తారు. ఈ అంశాల వల్ల లవ్ స్టోరీ రొటీన్ రొమాంటిక్ డ్రామా అనిపించుకోదు. అలా అని కేవలం కులాల మధ్య అంతరాన్ని చర్చించి వదిలిపెట్టదు. సమాజంలో ఎంతోమంది అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యను, ఎంతోమంది మహిళలు మౌనంగా భరిస్తున్న లైంగిక వేధింపుల ఇష్యూను టచ్ చేస్తుంది. చాలా సినిమాల్లో ఈ ఇష్యూను చర్చించడానికి చాలామంది ఇష్టపడలేదు. కానీ కమ్ముల మాత్రం ధైర్యం చేశాడు.  స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ ను పెట్టి తీసిన ఓ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఈ అంశాన్ని చర్చించిన కమ్ములను అభినందించాల్సిందే.

అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇందులో శేఖర్ కమ్ముల మార్క్ మూమెంట్స్ కూడా చాలానే ఉన్నాయి.

హీరోహీరోయిన్ల మధ్య లవ్ సీన్స్ అద్భుతంగా పండాయి. సాంగ్స్ అయితే మేజిక్ చేశాయి. సారంగ దరియా ఇప్పటికే పెద్ద హిట్ అవ్వగా.. ఏవో ఏవో కలలు అనే సాంగ్ పిక్చరైజేషన్ తో మెస్మరైజ్ చేస్తుంది.

ఇందులో సాయిపల్లవి డాన్స్ సింప్లీ సూపర్బ్. ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. వీటితో పాటు కొన్ని హార్ట్ టచింగ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న సన్నివేశాలతో గుండెకు హత్తుకునేలా తీయడం కమ్ముల స్పెషాలిటీ. అది ఈ సినిమాలో కూడా కనిపించింది. చిన్నప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్న హీరోయిన్ పాత్రను చాలా మెచ్యూర్డ్ గా డిజైన్ చేశాడు కమ్ముల. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మౌనిక పాత్ర నడుచుకునే తీరు బాగుంది. ఈ పాత్రతో పాటు సినిమాలోని చాలా సన్నివేశాల్లో కమ్ముల రైటింగ్ మెరుస్తుంది. మౌనిక కులం పాయింట్ తో నోరుజారి రేవంత్ మనసును గాయపరిచే సన్నివేశంలో పండిన డ్రామా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇలాంటి 3-4 సన్నివేశాల్లో కమ్ముల శైలి స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక క్లైమాక్స్ విషయానికొస్తే.. అది ఎలా ఉండబోతోందనే విషయాన్ని దర్శకుడు చాలా ముందుగానే హింట్స్ ఇస్తాడు మనకి. చివర్లో పెద్ద ట్విస్ట్ ఉండబోతోందనే విషయం మనకు అర్థమౌతూనే ఉంటుంది. అయినప్పటికీ లాస్ట్ లో వచ్చే సన్నివేశాలు ఎందుకో అంత తృప్తినివ్వవు. ఓవైపు గుండె బరువెక్కుతున్నప్పటికీ, మరోవైపు తొందరగా ముగించినట్టు కూడా అనిపిస్తుంది.

నాగచైతన్య తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దాదాపు ప్రతి సినిమాలో క్లాస్ గా కనిపించే ఈ అక్కినేని హీరో ఆర్మూరు కుర్రాడిలా, రూరల్ అబ్బాయిగా భలే సెట్ అయ్యాడు. ఆ హెయిర్ స్టయిల్, ఆ మాటతీరు, వేసుకున్న దుస్తులు అన్నీ రేవంత్ పాత్రకు బాగా సూట్ అయ్యాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కమ్ముల స్కూల్ లో ఒదిగిపోయాడు చైతన్య. ఇక సాయిపల్లవి ఎప్పట్లానే తన పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసింది. యాక్టింగ్-డాన్స్ చించేసింది. ఈశ్వరీరావు, దేవయాని, రాజీవ్ కనకాల, ఉత్తేజ్ తమ పాత్రల్లో మెప్పించారు.

టెక్నీషియన్స్ విషయానికొస్తే ముందుగా సంగీత దర్శకుడు పవన్ గురించే చెప్పుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో మ్యూజిక్ పరంగా ది బెస్ట్ వర్క్ ఈ సినిమాలో చూడొచ్చు. తన సంగీతంతో పవన్, లవ్ స్టోరీని మరో మెట్టుపైకి తీసుకెళ్లాడు. సారంగదరియా సాంగ్ స్క్రీన్ పై కూడా అదిరింది. అయితే దీనికంటే ముందు ”ఏవో ఏవో కలలే” పాటకే అగ్రస్థానం ఇవ్వాలి. ప్రొడక్షన్ డిజైన్, కెమెరావర్క్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్  గా ఉంటే బాగుండేది.

కమ్ముల ఈసారి తన రైటింగ్ కు రెండు వైపుల పదును ఉందని చూపించాడు. ఇటు ఓ ప్రేమకథను అందంగా హ్యాండిల్ చేస్తూనే, మరోవైపు 2 బలమైన సామాజికాంశాల్ని హైలెట్ చేస్తూ మంచి రైటింగ్ చూపించాడు. అయితే తన శైలికి భిన్నంగా వెళ్లడంతో నెరేషన్ పై అక్కడక్కడ గ్రిప్ కోల్పోయాడు.

ఓవరాల్ గా “లవ్ స్టోరీ” సినిమా రెగ్యలర్ ఫార్మాట్ లోనే సాగినప్పటికీ.. రెండు కీలకమైన ఇష్యూస్ ను టచ్ చేయడం, ఎమోషన్స్ కారణంగా మెప్పిస్తుంది. అయితే రన్ టైమ్ కాస్త ఎక్కువవ్వడం, నెరేషన్ లో తడబడడం ఈ సినిమాకు చిన్న అడ్డంకులుగా నిలుస్తాయి. వీటిని మినహాయిస్తే.. మ్యూజిక్, నటన, ఎమోషనల్ సీన్స్ హైలెట్ అవుతాయి. అయితే “ఫిదా”, “హ్యాపీడేస్” టైపులో ఇందులో పెప్పీ రొమాన్స్ ను మాత్రం ఆశించొద్దు.

Rating: 3/5

By: పంచ్ పట్నాయక్

 

More

Related Stories