శంకర్ కి వ్యతిరేకంగా కోర్టుకెక్కిన లైకా

Shankar


“ఇండియన్ 2” (భారతీయుడు 2) సినిమా పూర్తి చేసిన తర్వాతే మరో సినిమా మొదలుపెట్టేలా డైరక్టర్ శంకర్ని ఆదేశించాలంటూ ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా కోర్టును ఆశ్రయించింది. శంకర్కి వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. ఐతే, శంకర్ వర్షన్ వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు కేసును వాయిదా వేసింది.

రామ్ చరణ్ హీరోగా శంకర్ భారీ సినిమా మొదలుపెడుతున్నారు. దిల్ రాజు నిర్మించే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. దాంతో లైకా సంస్థ కోర్టుకెక్కింది.

ఈ మొత్తం గొడవ ఎందుకంటే…

లైకా సంస్ధ శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా “2 పాయింట్ ఓ” సినిమాని నిర్మించింది. ఈ సినిమా నిర్మాణానికి తడిసి మోపెడు అయింది. దాంతో లైకా చాలా నష్టపోయింది. ఆ నష్టాలను పూడ్చేందుకు అదే సంస్థకు “ఇండియన్ 2” తీసేందుకు శంకర్ ఒప్పుకున్నాడు. కమల్ హాసన్ హీరోగా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ ఇతర పాత్రల్లో ఈ సినిమా రెండేళ్ల క్రితం ఘనంగా ప్రారంభం అయింది.

కొన్నాళ్ల షూటింగ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయింది. అనుకున్న బడ్జెట్ దాటిపోయింది. నిర్మాతలకు, శంకర్ కి విబేధాలు వచ్చాయి. చివరికి రాజీకొచ్చి గతేడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ని మళ్ళీ స్టార్ట్ చేశారు. ఐతే, సెట్ లో క్రేన్ కూలడం, ఆ ఘటనలో ముగ్గురు చనిపోవడం, కమల్, కాజల్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడడంతో మళ్ళీ షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత కరోనా, లాక్డౌన్ వచ్చిపడ్డాయి.

ఈ ఏడాది షూటింగ్ మొదలుపెడుదామనుకుంటే… కమల్ హాసన్ ఎన్నికల కారణంగా సినిమా షూటింగ్ కి రానని చెప్పారు.

దాంతో విసుగుచెందిన శంకర్… ఈ సినిమాని పక్కన పెట్టి… దిల్ రాజుకి కాల్ చేశారు. దిల్ రాజు వెంటనే చరణ్ ని లైన్ లో పెట్టి భారీ సినిమాని సెట్ చేశారు. ఈ సినిమా ప్రకటన రాగానే లైకా సంస్థ అలెర్ట్ అయింది. “ఇండియన్ 2” సినిమా పూర్తి చెయ్యకుండా అలా ఎలా ఇంకో సినిమా స్టార్ట్ చేస్తారని లైకా వాదిస్తోంది.

236 కోట్లు ఖర్చు, శంకర్ కి 40 కోట్లు

“మేం 180 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఇండియన్ 2 మొదలుపెట్టాం. కానీ అనుకున్న బడ్జెట్ దాటిపోయింది. ఇప్పటికే 236 కోట్లు ఖర్చు అయ్యాయి. శంకర్ కి 40 కోట్ల పారితోషికం ఇస్తామని ఒప్పుకున్నాం. అందులో 14 కోట్లు ఆల్రెడీ ఆయనకిచ్చాం. ఇంకా బ్యాలన్స్ 26 కోట్లు కోర్టులో సమర్పించడానికి సిద్ధం. కానీ ఆయన ముందు సినిమా పూర్తి చెయ్యాలి,” ఇలా కోర్టుకు విన్నవించుకొంది లైకా సంస్థ.

శంకర్ తన వాదనని ఈ నెల 15లోపు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 

Advertisement
 

More

Related Stories