మాస్ట్రో – తెలుగు రివ్యూ

Maestro still

“దాదాపు ఒరిజినల్ వెర్షన్ నే ఫాలో అయ్యాం. కథ-స్క్రీన్ ప్లేలో మార్పులు చేయలేదు. కేవలం మన ఆడియన్స్ సెన్సిబిలిటీస్ ను దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న మార్పులు మాత్రమే చేశాం.” మాస్ట్రో స్ట్రీమింగ్ కు ముందు నితిన్ చెప్పిన మాటలివి. స్ట్రీమింగ్ లో సినిమా చూసిన ఆడియన్స్ కూడా ఇదే ఫీల్ అయ్యారు.

హిందీలో సూపర్ హిట్టయిన సినిమా “అంధాధూన్”. ఆయుష్మాన్ ఖురానా హీరోగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లెక్కలేనన్ని అవార్డులు అందుకుంది. ఆయిష్మాన్ నటనకు, శ్రీరామ్ రాఘవన్ రేసీ స్క్రీన్ ప్లే కు నేషనల్ అవార్డ్స్ కూడా తెచ్చిపెట్టింది. క్రిటిక్స్ పరంగా కూడా పెద్ద హిట్. అందుకే ఈ సినిమాకు రీమేక్ గా తీసిన “మాస్ట్రో”కు కూడా పెద్దగా మార్పులు చేయలేదు. కథ, స్క్రీన్ ప్లేను మక్కికిమక్కి ఫాలో అయిపోయారు. ఎంతలా అంటే.. కనీసం నేపథ్యం కూడా మార్చలేదు. ఒరిజినల్ మూవీలో పూణె బ్యాక్ డ్రాప్ పెడితే.. మాస్ట్రోలో ఆ ఫీల్ కోసం గోవా బ్యాక్ డ్రాప్ పెట్టారు. ఏ హైదరాబాదో, విశాఖపట్నమో తీసుకోలేదు. మాస్ట్రో బిగినింగ్ పోర్షన్లలో ఆ ఫీల్ ను తీసుకురావడంతో గాంధీ సూపర్ సక్సెస్ అయ్యాడు.

అయితే విషయం ఎక్కడ తేడా కొట్టిందంటే.. తమన్నను తీసుకోవడమే మాస్ట్రోకు పెద్ద మైనస్ గా మారింది. నిజానికి తమన్న నటనను వంక పెట్టడానికేం లేదు. ఆమె చక్కగా చేసింది. కానీ ఒరిజినల్ వెర్షన్ తో పోల్చి చూస్తే ఆ వయసు తేడా కనిపించలేదు. “అంధాధూన్”లో ఆయుష్మాన్-టబు మధ్య ఏజ్ గ్యాప్ సరిగ్గా సరిపోయింది. ఆ పాత్రలకు, ఆ నేపథ్యానికి సరిగ్గా సరిపోయింది. కానీ “మాస్ట్రో” విషయంలో ఆ మేజిక్ రిపీట్ అవ్వలేదు. నితిన్-తమన్న దాదాపు ఒకే వయసులా అనిపించారు. అదే సమయంలో తమన్నకు పెళ్లయి, మరో ఎఫైర్ ఉన్నట్టు చూపించడం సెట్ కాలేదు. పైగా తమన్న సొంత డబ్బింగ్ కూడా పాత్రను పండించలేకపోయింది.

సినిమాలో అరుణ్ (నితిన్) పియానిస్ట్. బాగా వాయిస్తాడు. అతడికి సోఫీ (నభా నటేష్) గర్ల్ ఫ్రెండ్. ఈమెకు చెందిన రెస్టారెంట్ లోనే నితిన్ పియానో వాయిస్తుంటాడు. నితిన్ అంధుడిగా నటిస్తుంటాడు. అతడికి అన్నీ కనిపిస్తాయి. ఆ విషయం నభాకు కూడా తెలియదు. ఓరోజు నితిన్ పెర్ఫార్మెన్స్ నచ్చి అతడ్ని తన ఇంటికి పియానో వాయించడానికి పిలుస్తాడు మాజీ నటుడు మోహన్ (నరేష్). తన పెళ్లి రోజున భార్యకు సర్ ప్రైజ్ ఇవ్వాలనుకుంటాడు.

చెప్పినట్టుగానే నితిన్, మోహన్ ఇంటికి వస్తాడు. మోహన్ భార్య సిమ్రన్ (తమన్న) తలుపు తీస్తుంది. మోహన్ ఇంట్లో లేడని చెప్పడంతో అరుణ్ పియానో వాయిస్తుంటాడు. అయితే అదే టైమ్ లో తన లవర్ (జిషు)తో కలిసి భర్తను చంపేస్తుంది సిమ్రాన్. అదంతా అంధుడిగా నటిస్తున్న అరుణ్ చూస్తుంటాడు, కానీ ఏమీ తెలియనట్టు పియానో వాయిస్తూ ఉండిపోతాడు. తర్వాత ఈ హత్యపై కంప్లయింట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. అయితే అక్కడ పోలీస్ గా ఉన్నది సిమ్రాన్ ప్రియుడే. సరిగ్గా అప్పుడే సిమ్రాన్ కు, ఆమె లవర్ కు అరుణ్ పై అనుమానం వస్తుంది. అరుణ్ అంధుడు కాడని ఇద్దరూ నిర్ణయించుకుంటారు. అప్పుడు సిమ్రాన్ ఏం చేసింది? అసలు అరుణ్ అంధుడిగా ఎందుకు నటిస్తున్నాడు? అనేది మిగతా కథ.

సినిమా అంతా ఒరిజినల్ వెర్షన్ ను ఫాలో అయిన దర్శకుడు.. క్లైమాక్స్ లో మాత్రం చిన్న మార్పు చేశాడు. అయితే దర్శకుడు మేర్లపాక గాంధీ ఏ మార్పలైతే చేశాడో, అవి “మాస్ట్రో”లో క్లిక్ అవ్వలేదు. అలా చేసిన చిన్న మార్పులే ఈ సినిమా ఫలితంపై పెద్ద ప్రభావం చూపించాయనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. టోటల్ క్లైమాక్స్ పార్ట్ ను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. ఒరిజినల్ చూసిన వాళ్లకు ఇదొక మైనస్ అనిపిస్తుంది.

పెర్ఫార్మెన్సుల విషయానికొస్తే, గుడ్డివాడుగా నితిన్ చక్కగా చేశాడు. నితిన్ తన కెరీర్ లో కనబరిచిన మంచి పెరఫార్మాన్స్ లో ఇదొకటి. తమన్న కూడా అంతే. లేడీ విలన్ గా చక్కగా నటించింది. కానీ టబును మరిపించలేకపోయింది. ఇక నబా నటేష్ అయితే పూర్తిగా మిస్ ఫిట్. అంతే కాదు, మేకప్ సమస్యో, ఆమె ఫేస్ ఉబ్బిందో తెలీదు కానీ ఆమె ఇందులో అందంగా కూడా కనిపించలేదు. నరేష్, జిషు బాగా చేశారు. శ్రీముఖి, రచ్చరవి, మంగ్లీ తమ పాత్రలకు సెట్ అయ్యారు.

టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, రీ-రికార్డింగ్ కథకు తగ్గట్టు బాగా సెట్ అయ్యాయి. దర్శకుడి విషయానికొస్తే.. క్లైమాక్స్ పార్ట్ మినహా మిగతాదంతా మక్కికిమక్కి ఫీల్ పోకుండా తీయడంలో గాంధీ సక్సెస్ అయ్యాడు.

ఓవరాల్ గా “మాస్ట్రో” సినిమా ఫ్రెష్ ఆడియన్స్ కు నచ్చుతుంది. ఒరిజినల్ వెర్షన్ చూసిన వాళ్లకు అంతగా ఎక్కదు.

by ‘పంచ్’ పట్నాయక్

 

More

Related Stories