మహాసముద్రం – తెలుగు రివ్యూ

Maha Samudram

మహాసముద్రం.. ఓ మల్టీస్టారర్ కథ. దర్శకుడు అజయ్ భూపతి మూడేళ్లుగా నమ్ముకున్న కథ. ఈమధ్య కాలంలో చాలా హైప్ వచ్చిన సినిమా ఇది. మరి అలాంటి కథ ఎలా ఉండాలి? తెరపై దుమ్ముదులపాలి, ట్విస్టులతో అదరగొట్టాలి. స్క్రీన్ ప్లేతో కట్టిపడేయాలి. కానీ మహాసముద్రంలో అలాంటి ఆటుపోట్లు, ఉవ్వెత్తున ఎగిసే కెరటాలు కనిపించవు. మహాసముద్రం కాస్తా చిన్న చెరువులా నిమ్మలంగా అనిపిస్తుంది. రెగ్యులర్ ప్లేతో, రొటీన్ సన్నివేశాలతో సాగుతుంది.

తన తొలి సినిమా “ఆర్ఎక్స్100″లో అలలా ఎగిసిపడే ప్రేమను చూపించిన దర్శకుడు.. మహాసముద్రంలో కొలవలేనంత ప్రేమను చూపిస్తానంటూ తనే ప్రకటించుకున్నాడు. దీంతో చాలామంది భారీగా నమ్మకాలు పెట్టేసుకున్నారు. అయితే ఇందులో అంత సీన్ లేదు. ఈ ప్రేమను, ఈ ఎమోషన్ ను కొలవొచ్చు. ఇక్కడ ఇంతే అని ఈజీగా చెప్పేయొచ్చు. నెక్ట్స్ ఏమొస్తుంది, ఏమౌతుందనేది కూడా ఊహించుకోవచ్చు. అంత తీసికట్టుగా ఉంది ఈ మహాసముద్రం నెరేషన్.

కథ విషయానికొస్తే.. వైజాగ్ లో అర్జున్, విజయ్ మంచి స్నేహితులు. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన విజయ్, అర్జున్ ఇంట్లో కుటుంబసభ్యుడిగా పెరుగుతాడు. ఇద్దరికీ లవర్స్ ఉంటారు. అర్జున్, స్మితను ప్రేమిస్తాడు. విజయ్ మహాను ప్రేమిస్తాడు. అయితే అనుకోకుండా జరిగిన పరిణామాలతో సిటీ స్మగ్లర్ ధనుంజయ హత్య, విజయ్ మెడకు చుట్టుకుంటుంది. దీంతో విజయ్ సిటీని వీడాల్సి వస్తుంది. అలా నాలుగేళ్ల పాటు ఎవ్వరికీ కనిపించకుండా పోతాడు విజయ్. అదే టైమ్ లో విజయ్ ప్రేయసి గర్భవతి అవుతుంది. ఆమెను, ఆమె పాపను అర్జున్ చూసుకుంటాడు. తరువాత అర్జున్ స్మగ్లర్ గా మారాల్సి వస్తుంది. నాలుగేళ్ల తర్వాత సిటీకొచ్చిన విజయ్.. అర్జున్-మహాపై అనుమానం పెంచుకుంటాడు. అక్కడ్నుండి స్నేహితుల మధ్య వైరం ముదురుతుంది. ఆ తర్వాత ఏమైంది? అర్జున్ ఎందుకు స్మగ్లర్ గా మారాడు? అర్జున్, విజయ్ మళ్ళీ కలిశారా? విజయ్ ఉన్నఫలంగా చెడ్డవాడిగా మారడానికి కారణం ఏమిటి అనేది మిగతా కథ.

ఈ సినిమా కోసం మంచి పాత్రలు అనుకున్నాడు దర్శకుడు. అర్జున్ గా శర్వానంద్ ను, విజయ్ గా సిద్దార్థ్ ను బాగా చూపించాడు. మహాగా అదితిని ప్రజెంట్ చేయడంతో పాటు.. చుంచుమామ, గూనిబాబ్జి, ధనుంజయ్ లాంటి మంచి పాత్రల్ని సృష్టించాడు. కాకపోతే పాత్రలు, వాటి నడతపై ఎక్కువగా దృష్టిపెట్టిన దర్శకుడు అజయ్ భూపతి.. ఎంగేజింగ్ గా కథను చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ ”ఏంగేజింగ్” అనే పదానికి చాలా అర్థం ఉంది. సినిమా చూస్తే అది అర్థమౌతుంది. నిజానికి అన్ని సినిమాలకు బలమైన కథ అక్కర్లేదు. ఇంట్రెస్టింగ్ పాత్రలు, ఎంగేజ్ చేసే కథనంతో రొటీన్ స్టోరీల్ని కూడా బాగా చెప్పొచ్చు. మహాసముద్రానికి ఇదే పెద్ద మైనస్ అయింది.

సినిమాలో శర్వానంద్ పాత్రను దర్శకుడు బాగా రాసుకున్నాడు. ఓ డైలాగ్ లో చెప్పినట్టు శర్వానంద్ భారం మొత్తాన్ని మోశాడు. చివరికి తన స్నేహితుడే ప్రత్యర్థిగా ఎదురైనప్పుడు కూడా చెక్కుచెదరడు. అయితే ఇంత డెప్త్ సిద్దార్థ్ పాత్రలో కనిపించదు. తన స్వార్థం కోసం ప్రేయసిని వదిలేసిన సిద్దార్థ్, తిరిగొచ్చి శర్వా దగ్గర తన ప్రేయసిని చూసి లేనిపోని శత్రుత్వాన్ని పెంచుకోవడంలో లాజిక్ కనిపించదు. ఇంత పెద్ద లోపాన్ని పెట్టుకొని, స్నేహం, పరిణతి చెందిన ప్రేమను మహాసముద్రంలో చూపించాలనుకున్నాడు దర్శకుడు. మంచి స్క్రీన్ ప్లేను అల్లలేకపోయాడు. ఆ రొటీన్ స్క్రీన్ ప్లే బాగా బోర్ కొట్టిస్తుంది.

ఎటువంటి అలల ఉధృతి లేకుండా సినిమా అలా సాగిపోతుంది. బలమైన కాన్ ఫ్లిక్ట్ ను చూపించలేకపోయాడు దర్శకుడు. తనను అడ్డంగా వాడుకుంటున్నాడని తెలిసి కూడా అదితి, పదే పదే సిద్దార్థ్ ను ఎందుకు ప్రేమిస్తుందో అర్థం కాదు. శర్వానంద్ ఇంట్లో ఉంటూ సిద్ధూ ప్రేమ కోసం ఎందుకు తపిస్తుందో, తన కాళ్లపై తను నిలబడగలనని చెప్పిన అమ్మాయి అలా ఎందుకు ఉంటుందో అర్థంకాదు. సిద్ధార్థ్ మళ్లీ సీన్ లోకి రావడంతోనే మెలొడ్రామా మొదలవుతుంది. చివర్లో కిడ్నాప్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ సీన్స్ అస్సలు వర్కవుట్ కాలేదు.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు శర్వానంద్ తన పాత్రకు న్యాయం చేశాడు. అతడి పాత్రలో ఉన్నంత డెప్త్ సిద్దార్థ్ పాత్రలో కనిపించదు. సిద్ధార్థ్ క్యారెక్టర్ ఆర్క్ బాగాలేదు. అయితే నెరేషన్ లో లోపం ఉన్నప్పటికీ, సిద్దార్థ్ తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. లవర్ బాయ్ ఇమేజ్ తెగ్గొట్టుకొనే పాత్ర ఇది. నెగెటివ్ షేడ్స్ లో ఆకట్టుకున్నాడు. మహా పాత్ర పోషించిన అదితిరావుకు సినిమాలో కీలక పాత్ర దక్కింది. కానీ నటన మరి రొటీన్. ఇక మరో హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ పాత్ర అస్సలు బాగాలేదు. ఆ క్యారెక్టర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇద్దరు హీరోయిన్లు ఉండాలి కాబట్టి ఆమెను తీసుకున్నట్టున్నారు. మొదటి సినిమాలానే, మహాసముద్రంలో కూడా సపోర్టింగ్ రోల్స్ పై దర్శకుడు బాగా నమ్మకం పెట్టుకున్నట్టున్నాడు. చుంచుమావగా జగపతిబాబు, గూని బాబ్జీగా రావురమేశ్, డాన్ ధనుంజయ్ గా గరుడ రామ్ తన పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ గా చెప్పుకోవాల్సి వస్తే ముందుగా సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట గురించే మాట్లాడుకోవాలి. అతడి వర్క్ ఈ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది. సినిమా టోన్, ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. ఆర్ఎక్స్ 100లో పాటలతో మెప్పించిన చైతన్ భరధ్వాజ్, మహాసముద్రానికి మంచి పాటలు ఇవ్వలేకపోయాడు. ఒక్క పాట మినహా మిగతావన్నీ మైనస్.

ఫైనల్ పాయింట్:
ఓవరాల్ గా “మహాసముద్రంలో రెండు బలమైన పాత్రలు కనిపిస్తాయి కానీ సినిమా మాత్రం బలంగా సాగదు. ఏ దశలోనూ ఆసక్తికరంగా అనిపించదు. కథలో డెప్త్ లేదు, కథనం రక్తికట్టలేదు.

Rating: 2.5/5

పంచ్ పట్నాయక్

Advertisement
 

More

Related Stories