సంక్రాంతి పండగకి కొత్త అల్లుడికి అతిగా మర్యాదలు చెయ్యడం వంటివి తెలుగునాట ఉన్న సంప్రదాయం. సంక్రాంతి అల్లుడు అనే పదం అలా వచ్చింది. కొత్త సినిమాల విషయంలో “సంక్రాంతి అల్లుడు” వస్తున్నాడు అని హీరో గురించి రాస్తుంటారు. కానీ ఈ సారి మహేష్ అభిమానులు “సంక్రాంతి మొగుడు” అనే పదం ఉపయోగిస్తున్నారు.
సంక్రాంతి మొగుడు పండగ వాతారవరణం తెస్తున్నాడు అంటూ మహేష్ అభిమానులు కొత్త పోస్టర్ ని ట్రెండ్ చేస్తున్నారు. “గుంటూరు కారం” కొత్త పోస్టర్ లో మహేష్ బాబు లుంగీ కట్టుకొని నడుస్తున్న దృశ్యం ఉంది. అతని వెనుకాల ఈశ్వరి రావు, రఘుబాబు కనిపిస్తుండగా, హీరోయిన్ శ్రీలీల లంగావోణిలో నిల్చొని చూస్తోంది.
ఈ ఫోటో చూస్తుంటే త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ డ్రామా అనిపిస్తోంది. కానీ కేవలం ఫ్యామిలీ డ్రామానే కాదు ఈసారి “ఊచకోత” మూమెంట్స్ కూడా ఎక్కువేనట. మాస్ కోసం యాక్షన్, ఆ హడావిడి కూడా ఎక్కువే చూపిస్తున్నారట త్రివిక్రమ్.
“గుంటూరు కారం”లో రమ్యకృష్ణ తల్లి పాత్రలో కనిపిస్తారు. ప్రకాష్ రాజ్ తాతయ్యగా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి మరదలుగా నటించనుంది. శ్రీలీల, మహేష్ బాబు మధ్య ఉండే రొమాన్స్ కూడా జనాలని ఆకట్టుకునేలా ఉంటుందట. మహేష్ బాబు ఇందులో రమణ అనే పాత్ర పోషిస్తున్నారు.
“గుంటూరు కారం” వచ్చే నెల 12న విడుదల కానుంది.