
బాలీవుడ్ లో అడుగుపెట్టాలని ఆలోచన లేదని సూపర్ స్టార్ మహేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. పాన్ ఇండియా మోజులో హీరోలందరూ ఇప్పుడు హిందీ మార్కెట్ పై దృష్టి పెట్టారు. మహేష్ బాబుకి గతంలో కూడా బాలీవుడ్ ఆఫర్ల వచ్చాయి. వాటిని తీసుకోలేదు. ఇప్పుడు కూడా అదే మాట.
“హిందీ ప్రేక్షకులను తెలుగు సినిమాలతో కూడా మెప్పించొచ్చు. ఇప్పుడు అదే జరుగుతోంది కదా. ప్రపంచమంతా మన తెలుగు సినిమాలు చూస్తున్నారు. కాబట్టి హిందీ సినిమా చెయ్యాలని లేదు. తెలుగు సినిమాలు సరిగా చేస్తే చాలు,” అని సమాధానం ఇచ్చారు మహేష్ బాబు.
ఒక ఈవెంట్ లో మహేష్ బాబు ఈ కామెంట్ చేశారు. ఆయన మాట వైరల్ అయింది.
బాహుబలి, బాహుబలి 2, రజినీకాంత్ 2.0, కేజీఎఫ్, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ …. ఇలా దక్షిణాది చిత్రాలు ఇటీవల హిందీ మార్కెట్ లో సంచలనం సృష్టించాయి. త్వరలోనే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. దాంతో, ఆయన కూడా పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరో అవుతారు. అందుకే, ఆయన ప్రత్యేకంగా హిందీ మార్కెట్ పై దృష్టి పెట్టడం లేదు.