రేట్లు తగ్గించడం అంటే ఇలా?

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, ఆచార్య, కేజీఎఫ్-2, సర్కారువారి పాట.. ఇలా పెద్ద సినిమాలకు వరుసపెట్టి టికెట్ రేట్లు  పెంచేసిన నేపథ్యంలో.. ఎఫ్3 సినిమాకు సాధారణ టికెట్ రేట్లనే ఉంచుతున్నామని, ధరలు పెంచడం లేదని నిర్మాత ప్రకటించాడు. వాళ్లు చెప్పింది కొంత నిజమే కావొచ్చు కానీ ప్రేక్షకులు మాత్రం ఆ టికెట్ రేట్లను సైతం అంగీకరించలేదనే చెప్పుకోవాలి.

అసలు టికెట్ రేట్లు తగ్గించడం అంటే ఏంటి? ఎంత తగ్గిస్తే ప్రజలు ఆమోదిస్తారు? ఇలాంటి చర్చ నడుస్తున్న వేళ.. మేజర్ సినిమాకు టికెట్ ధరలు ప్రకటించారు. అడివి శేష్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ రేట్లు ఫిక్స్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్య ప్రేక్షకుడు సైతం అంగీకరించే రేటు ఛార్ట్ ఇది.

మేజర్ సినిమాకు తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రేటును 150 రూపాయలుగా నిర్ణయించారు. అదే  మల్టీప్లెక్సుల్లో అయితే ఈ రేటు 195 రూపాయలు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, సింగిల్ స్క్రీన్స్ లో 147 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 177 రూపాయలుగా నిర్ణయించారు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇవి రీజనబుల్ రేట్ల కిందే లెక్క. పైగా ఇవి హయ్యస్ట్ రేట్లు మాత్రమే. బి-క్లాస్, బెంచ్ టికెట్ ధరలు మరింత తక్కువకు అందుబాటులోకి రానున్నాయి.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇలా తక్కువ ధరకు టికెట్ రేట్లు  నిర్ణయించామని మేకర్స్ ప్రకటించారు. ఈమధ్య కాలంలో ఓ సినిమాకు ఇలా అతి తక్కువ టికెట్ రేట్లు పెట్టడం ఇదే. ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాల్నిస్తుందో చూడాలి.

Advertisement
 

More

Related Stories