
మంజిమా మోహన్ తెలుగులో పలు సినిమాల్లో నటించింది. కానీ, ఆమెకి తెలుగులో అంతగా గుర్తింపు దక్కలేదు. తమిళంలోనే ఆమెకి ఎక్కువ అవకాశాలు వచ్చాయి. బొద్దుగా ఉండడం ఒక కారణం కావొచ్చు.
మంజిమా ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆమె పెళ్లి కబురు హెడ్ లైన్స్ గా మారింది. ఈ అమ్మడు చాలా కాలంగా తమిళ యువ హీరో గౌతమ్ కార్తీక్ తో డేటింగ్ లో ఉందట. ఇంతకీ గౌతమ్ కార్తీక్ ఎవరో కాదు ఒకప్పటి హీరో కార్తీక్ (సీతాకోక చిలుక, అభినందన) కొడుకు. మణిరత్నం తీసిన ‘కడలి’ సినిమాతో హీరోగా అడుగుపెట్టాడు.
మంజిమా, గౌతమ్ కార్తీక్ త్వరలో పెళ్లి చేసుకొనే అవకాశం ఉందని కోలీవుడ్ కోడై కూస్తోంది.
మంజిమా తెలుగులో నాగ చైతన్య సరసన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో నటించింది. అలాగే, బాలకృష్ణ హీరోగా తీసిన ఎన్టీఆర్ బయోపిక్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహా నాయకుడు’ చిత్రాల్లో నారా భువనేశ్వరిపాత్రలో కనిపించింది. గతవారం విడుదలైన డబ్బింగ్ చిత్రం ‘ఎఫ్ ఐ ఆర్’లో ఒక పాత్ర పోషించింది.