మార్క్ ఆంటోనీ – తెలుగు రివ్యూ

Mark Antony

నవ్వించడం కోసం లాజిక్ ను పక్కనపెట్టడం కామన్. చాలా సినిమాల్లో చూశాం. కానీ అలా నవ్వించడం కోసం ఏకంగా లాజిక్ ను తుంగలో తొక్కడం మాత్రం దౌర్భాగ్యం. ఆ గతి ‘మార్క్ ఆంటోనీ’కి పట్టింది.

కథ విషయానికొస్తే.. ఇదొక పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ రివెంజ్ డ్రామా. కానీ ట్రీట్ మెంట్ విషయానికొచ్చేసరికి పక్కా కామెడీ సినిమా అనుకోవాలి. ఈ సినిమా కథ ఇటు 1975కి, అటు 1995కి మధ్య జరుగుతుంది. 75లో ఆంటోనీ అనే గ్యాంగ్ స్టర్, గ్యాంగ్ వార్ లో చనిపోతాడు. ఆంటోనీ కొడుకు మార్క్ ను, జాకీ చేరదీసి, తండ్రిలా పెంచి పోషిస్తాడు. చనిపోయిన తండ్రిపై మార్క్ కు పట్టరాని కోపం. అతడి వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు, చివరికి లవ్ విషయంలో కూడా తండ్రి వల్లనే సమస్యలు వస్తాయి. దీంతో తండ్రి ఆంటోనీపై పగ ఎక్కువవుతుంది.

సరిగ్గా ఇలాంటి టైమ్ లోనే టైమ్ ట్రావెల్ ఫోన్ అతడికి దొరుకుతుంది. ఆ ఫోన్ ద్వారా గతంలోకి వెళ్లి, తండ్రిని కాంటాక్ట్ అయి, తన కోపం అంతా తీరేలా తిట్టాలనుకుంటాడు. కానీ ఫోన్ కాల్ పూర్తయిన తర్వాత, తల్లి మరణం గురించి కొన్ని విషయాలు తెలిసి షాక్ అవుతాడు. దీంతో తండ్రిని ఎలాగైనా బతికించుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? మార్క్, తన తండ్రి ఆంటోనీని బతికించుకున్నాడా లేదా? ఇంతకీ జాకీ ఎవరు.. గతంలో అతడు ఏం చేశాడు? ఈ మొత్తం కథలో ఏకాంబరం పాత్రేంటి? ఇది సింపుల్ గా మార్క్ ఆంటోనీ స్టోరీ.

ఇందులో ఇద్దరు విశాల్ లు, ఇద్దరు ఎస్ జే సూర్యలు కనిపిస్తారు. అంతా తండ్రీకొడుకులే. ఈ కథకు కాస్త కొత్తదనం తెచ్చిపెట్టిన అంశం ఏదైనా ఉందంటే, అది ఈ అంశం మాత్రమే. ఇక టైమ్ ట్రావెల్ అనేది మనకు చాలా సుపరిచితమైన కాన్సెప్ట్. పైగా ఈమధ్య శర్వానంద్ హీరోగా ఓ సినిమా కూడా వచ్చింది. అంతకంటే ముందు ప్లేబ్యాక్, అద్భుతం అనే సినిమాలు కూడా వచ్చాయి.

దాదాపు మార్క్ ఆంటోనీది కూడా ఇదే కాన్సెప్ట్. కాకపోతే దీన్ని పూర్తిస్థాయిలో కామెడీగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్ అయింది. కామెడీ కోసం అతడు పాకులాడిన విధానం చూస్తే జాలేస్తుంది. ఒక దశలో కేవలం కామెడీ కోసం కథను కూడా పక్కనపెట్టేశాడు ఈ దర్శకుడు.

మార్క్ ఆంటోనీ పీరియాడిక్ లుక్ చూస్తే విషయం ఉందేమో అనిపిస్తుంది. టైమ్ ఫోన్ సీన్ లోకి వచ్చిన తర్వాత కథ రసకందాయంలో పడుతుందని అనుకుంటాం. కానీ దర్శకుడు ఎక్కడా కథలో టెంపో మెయింటైన్ చేయలేదు. ఓ రకమైన అయోయమం మధ్య ఇంటర్వెల్ కార్డు వేసిన దర్శకుడు, సెకండాఫ్ లో ప్రేక్షకులకు చుక్కలు చూపించాడు. కథ ఎటు పోతుందో అర్థం కాదు ప్రేక్షకుడికి. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని గందరగోళం. కామెడీ కోసం వివరంగా చెప్పాల్సిన ఎపిసోడ్స్ ను కూడా కట్ చేసి పడేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు దర్శకుడు.

సెకండాఫ్ కు వచ్చేసరికి అప్పటివరకు మంచిగా ఉన్న పాత్రలన్నీ చెడుగా మారిపోతాయి. చెడు పాత్రలన్నీ మంచిగా మారిపోతాయి. ఇదొక కన్ఫ్యజన్ అనుకుంటే, “మానాడు” తరహాలో వచ్చిన సన్నివేశాలే మళ్లీ మళ్లీ వచ్చి చిరాకు తెప్పిస్తాయి. ఈ ఎపిసోడ్స్ లో విశాల్ పూర్తిగా తేలిపోయాడు. ఇంతకుముందే ఇలాంటి సినిమాలో నటించిన అనుభవం ఉండడంతో, ఎస్ జే సూర్య రెచ్చిపోయాడు. అతడి కామెడీ, డైలాగ్ డెలివరీ అక్కడ పేలింది. ఇక క్లయిమాక్స్ కు వచ్చేసరికి మళ్లీ రొటీన్.

2 గంటల 31 నిమిషాల ఈ మొత్తం సినిమాలో గంట నిడివి కథ ప్రేక్షకుడికి అర్థం కాదు. అలా అని దర్శకుడు ఏదో తన మేధస్సు ఉపయోగించి స్క్రీన్ ప్లే నడిపించాడనుకుంటే పొరపాటు. ఓ దశలో అతడే చేతులెత్తేశాడు.

రొటీన్ కథలు, పాత్రలు చేసే విశాల్ నుంచి మార్క్ ఆంటోనీ లాంటి డిఫరెంట్ మూవీ రావడం మెచ్చుకోదగ్గ విషయం. అయితే విశాల్ ఈ సినిమా కథనంలో మరింత జాగ్రత్తగా దర్శకుడ్ని నడిపించాల్సింది. ఇక ఎస్ జే సూర్య విషయానికొస్తే, ఈ సినిమాకు అసలు హీరో అతడే. సినిమాను ఆమాత్రం భరించగలిగామంటే ఎస్ జే సూర్య నటన, కామెడీనే కారణం. ఇక సునీల్ ఎప్పట్లానే ఏకాంబరం పాత్రలో మెప్పించాడు. రీతూవర్మ పేరుకే హీరోయిన్, కానీ ఆమె చేసిన పాత్ర గెస్ట్ రోల్ లాంటింది.

టెక్నికల్ గా కొన్ని మార్కులు పడుతాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని చాలా లౌడ్ గా కొట్టినట్లు అనిపిస్తుంది. సినిమాలో శబ్ద కాలుష్యం ఎక్కువే. మిగతా డిపార్ట్ మెంట్స్ గురించి ఒక్కొక్కటిగా చెప్పుకోవడం అనవసరం. ఎవరి పరిథిలో వాళ్లు ఈ సినిమా కోసం పనిచేశారు. నిర్మాత వినోద్ కుమార్ మాత్రం భారీగా ఖర్చు పెట్టాడు.

ఓవరాల్ గా “మార్క్ ఆంటోని”లో సైన్స్ ఫిక్షన్, గ్యాంగ్ స్టర్ అంశాలు జోడించి కొత్తగా చెప్పాలనే ప్రయత్నం జరిగింది. కానీ ఆ ప్రయత్నం కొన్ని సార్లు కిచిడిగా అనిపిస్తుంది. కొన్ని సార్లు ఫర్వాలేదనిపిస్తుంది. కానీ మొత్తంగా మాత్రం కంగాళీనే. మనస్ఫూర్తిగా నవ్వుకునే సన్నివేశాలు వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు.

బాటమ్ లైన్ – మస్కా కొట్టిన మార్క్

Rating: 2/5

By M Patnaik

Advertisement
 

More

Related Stories