‘మాస్’కు మళ్ళీ ఆదరణ

Waltair Veerayya and Veera Simha Reddy


సంక్రాంతికి విడుదలైన ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలు భారీ వసూళ్లు అందుకున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి మూవీదే పైచేయి. ఐతే, ‘వీర సింహా రెడ్డి’కి వచ్చిన ఓపెనింగ్స్, ఓవరాల్ కలెక్షన్స్ తక్కువేమి కాదు. ఈ రెండు సినిమాలకు వసూళ్లు రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగ సీజన్ కూడా కావడం కలిసొచ్చింది.

ఐతే, మాస్ సినిమాలను చూసేందుకు జనం మళ్ళీ ఇష్టపడుతున్నారు అనే మాట కూడా వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాల కథల్లో, కథనాల్లో కొత్తదనం అస్సలు లేదు. వింటేజ్ కార్లకు రంగులేసినట్లు వీటిని కొత్తగా ప్యాకేజ్ చేసి వదిలారు. అయినా, జనం థియేటర్లకు రావడం విశేషమే.

మాస్ సినిమాలకు కాలం చెల్లింది అనుకోవడానికి లేదు అని మరోసారి ప్రూవ్ చేశాయి ఈ సినిమాలు.

అలాగే చిరంజీవిని సరదాగా కనిపించే పాత్రల్లోనే చూసేందుకు ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. తన వయసుకు తగ్గట్లుగా హీరోయిన్ తో రొమాన్స్ లేకుండా ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’లు చేస్తే జనం పట్టించుకోలేదు. కానీ శృతి హాసన్ తో ‘నువ్వు శ్రీదేవి ఐతే నేను చిరంజీవి అవుతా’ అంటూ రొమాన్స్ చేస్తే ఎంజాయి చేసినట్లు అనిపిస్తోంది.

ఐతే, రెండు, మూడు సినిమాల సక్సెస్ తోనే మళ్ళీ ‘మాస్’ సినిమాలకు ఆదరణ పెరుగుతోందని ఫిక్స్ అయిపోవచ్చా? లేదా మరికొంత కాలం వేచి చూడాలా?

Advertisement
 

More

Related Stories