మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ!

- Advertisement -
Chiranjeevi


మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ అయింది. ఆదివారం మెగాభిమానలతో పాటు తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల ప్రతినిధులతో మెగాస్టార్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి కుడి చేతికి బ్యాండేజ్ కట్టుకొని వచ్చారు. దాంతో కలవరపడ్డ అభిమానులు ఏమైంది అని ప్రశ్నిస్తే అసలు విషయం చెప్పారు చిరంజీవి.

“కుడి చేతితో ఏ పని చేయాలన్నా నొప్పిగా, తిమ్మిరి వస్తున్నట్లు అనిపించింది. దాంతో డాక్టర్ ని కలిశాను. మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్ (median nerve) అనే నరం మీద ఒత్తిడి పడటం వల్ల అలా జరుగుతోందని డాక్టర్లు తేల్చారు. దాన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ (carpal tunnel syndrome) అంటారట. అపోలో ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్జరీ జరిగింది,” అని చిరంజీవి వెల్లడించారు.

సర్జరీ జరిగిన పదిహేను రోజుల తర్వాత కుడి చేయి మళ్లీ యధావిధిగా పని చేస్తుందట. దర్శకుడు విజయబాపినీడు అల్లుడయిన సుధాకర్ రెడ్డి తనకు ఎంతో కాలంగా పరిచయం ఉండడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సర్జరీ పూర్తి చేసినట్లు చిరంజీవి చెప్పారు.

సర్జరీ జరగడంతో సినిమా షూటింగ్ కి సెలవు ప్రకటించారు మెగాస్టార్. ఆయన ప్రస్తుతం “గాడ్ ఫాదర్” అనే సినిమాలో నటిస్తున్నారు.

నవంబర్ ఒకటి నుంచి మళ్ళీ “గాడ్ ఫాదర్” షూటింగ్ లో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి అంతా సెట్ అయింది కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని మెగాస్టార్ తన అభిమానులకి తెలిపారు.

 

More

Related Stories