మహా మేధావి, గొప్ప కవి: చిరంజీవి

Chiranjeevi with Sirivennela

మెగాస్టార్ చిరంజీవికి సాహిత్య పిపాస ఎక్కువ. కవులతో ఆయనకి స్నేహం ఎక్కువే. సినీమహాకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో ఆయనకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇద్దరిదీ ఒకే వయసు. చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలకు అద్భుతమైన గీతాలు విరచించారు సీతారామశాస్త్రి. ఆయనకి పద్మశ్రీ వచ్చిన వెంటనే ఇంటికి వెళ్లి సీతారామశాస్త్రిని సత్కరించిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి.

మంగళవారం ఉదయం కూడా సీతారామశాస్త్రికి చిరంజీవి ఫోన్ చేశారట. శ్వాసకోస సంబంధ క్యాన్సర్ కి సంబంధించి మద్రాస్ లో ఒక మంచి హాస్పిటల్ ఉంది అక్కడికి ట్రీట్మెంట్ కి వెళదామని చిరంజీవి సూచించారట. ఆ వివరాలతో పాటు సిరివెన్నెలతో తన అనుబంధాన్ని, ఆయన పాటల గొప్పతనాన్ని మెగాస్టార్ వివరించారు. గొప్ప నివాళులు అర్పించారు ఆ మవకవికి.

వేటూరి గారి తర్వాత అంతటి గొప్ప అని పేర్కొన్నారు చిరంజీవి. చిరంజీవి మాటల్లోనే…

“ముఖ్యంగా నాకు అత్యంత ఇష్టమైన రుద్రవీణ సినిమాలోని తరలిరాదా తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం అనేపాటలో లాగా ఆయన మన అందరినీ వదిలి తరలి వెళ్ళిపోయారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు, కానీ సిరివన్నెల సీతారామశాస్త్రి గారు కానీ ఇలా అర్థాంతరంగా వెళ్లిపోవడం చిత్ర పరిశ్రమకు ఎవరూ పూరించలేని లోటు. భౌతికం సిరివెన్నెల సీతారామశాస్త్రి దూరమయ్యారు కానీ తన పాటలతో ఇంకా ఆయన బతికే ఉన్నారు. తన పాట బతికున్నంతకాలం సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా బతికే ఉంటారు.

తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించారు. వేటూరిగారి తర్వాత అంత గొప్ప సాహిత్య విలువలను ఈ తరానికి అందించిన గొప్ప రచయిత సిరివెన్నెల సీతారామశాస్తి. ఆయన భాషను అర్ధం చేసుకోవడానికి కూడా మనకున్న పరిజ్ఞానం సరిపోదు అంతటి మేధావి ఆయన.

ఎన్నో అవార్డులు, రివార్డులు తన కెరియర్ లో అందుకున్నఆయనకు 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందివ్వగా ఆ రోజున నేను వ్యక్తిగతంగా ఆయన ఇంట్లో చాలాసేపు గడిపాను. సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి వ్యక్తిని కోల్పోతే సొంత బంధువుని కోల్పోయినట్లుగా చాలా దగ్గరి ఆత్మీయుడిని కో ల్పోయినట్లు అనిపిస్తోంది. గుండె తరుక్కుపోతోంది… గుండెంతా బరువెక్కి పోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. ఎంతో మందిని శోక సముద్రంలో ముంచి దూరమైపోయిన
ఆయన నిజంగా మనందరికీ, ఈ సాహిత్య లోకమంతటికి అన్యాయం చేశారు. ముఖ్యంగా మా లాంటి మిత్రులకుఅన్యాయం చేసి వెళ్ళిపోయారు.

ఆయన సాహిత్యంలో శ్రీశ్ర గారి పదును కనపడుతుంది. ఈ సమాజాన్ని మేలుకొలిపే విధంగా ఒక శక్తి ఉంటుంది. ఈ సమాజంలో తప్పు ఎత్తి చూపే విధంగా ఆయన సాహిత్యం ఉంటుంది. ఈ సమాజానికి పట్టిన కుళ్ళు కడిగిపారేసే విధంగా ఉంటుంది. అంత పవర్‌ ఆయన సాహిత్యంలోనే కాదు ఆయన మాటల్లోనే కాదు, ఆయన కలంలోనే కాదు ఆయన మనస్తత్వం కూడా దాదాపు అలాగే ఉంటుంది.

అలాంటి గొప్ప వ్యక్తి గొప్ప కవి మళ్లీ మనకు తారసపడడం కష్టమే. ఆయన ఆ తల్లి సరస్వతీ దేవి వడిలో సేద తీరుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.”


 

More

Related Stories