మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి – తెలుగు రివ్యూ

- Advertisement -
Miss Shetty Mr Polishetty

లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క చేసిన మూవీ … మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. “జాతిరత్నాలు” తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన మూవీ కూడా ఇదే. మరి ఈ సినిమా శెట్టి కాంబోకు సక్సెస్ అందించిందా..?

ఈ సినిమాపై ఆసక్తి రేకెత్తించిన మొదటి అంశం హీరో, హీరోయిన్ల పెయిర్. వీళ్లిద్దరూ ఈ కథకు ఎలా సెట్ అయ్యారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉంది. దీనికి సమాధానం సినిమా చూస్తే తెలుస్తుంది. హీరో కంటే ఎక్కువ వయసున్న పాత్ర కావడంతో.. నవీన్-అనుష్క ఇట్టే సెట్ అయిపోయారు. వాళ్ల మధ్య సన్నివేశాలు కూడా బాగా వచ్చాయి. అయితే కెమిస్ట్రీ మాత్రం ఆశించిన స్థాయిలో కుదరలేదు. ఈ మైనస్ ను తన కామెడీ టైమింగ్ తో అధిగమించాడు నవీన్ పొలిశెట్టి.

కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో అనుష్క పాత్ర పేరు అన్విత. అన్విత లండన్ లో చెఫ్. ఇండివిడ్యువాలిటీ ఎక్కువ. అదే సమయంలో వివాహానికి కూడా వ్యతిరేకం. తల్లిని కోల్పోయిన అనుష్క, పెళ్లి అయితే చేసుకోదు కానీ ఒక బిడ్డకు తల్లి కావాలని మాత్రం ఆరాటడుతుంది. దీని కోసం వీర్యదానం చేసే వ్యక్తి కోసం వెదుకుతుంది. కొన్ని లక్షణాలు కూడా సెట్ చేసుకుంటుంది. అలాంటి లక్షణాల్ని స్టాండప్ కమెడియన్ నవీన్ పొలిశెట్టిలో చూస్తుంది. అతడికి దగ్గరవుతుంది. అసలు విషయం తెలియని హీరో పొంగిపోతాడు. ఆమెను పటాయించడానికి తెగ ప్రయత్నం చేస్తుంటాడు. ఓ పాయింట్ కు వచ్చేసరికి, పెళ్లి వద్దు.. కేవలం తన నుంచి సంతానాన్ని మాత్రమే అన్విత కోరకుంటోందని తెలుసుకొని షాక్ అవుతాడు. మరి ఇలాంటి సమయంలో నవీన్ ఏం చేశాడు. అనుష్క బిడ్డకు జన్మనిచ్చిందా లేదా అన్నదే స్టోరీ.

ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉండదని, బోల్డ్ కంటెంట్ మాత్రమే ఉంటుందని దర్శకుడు పి. మహేష్ బాబు రిలీజ్ కు ముందే క్లారిటీ ఇచ్చాడు. ఆ క్లారిటీ నిజమే. కాకపోతే ఆ బోల్డ్ కంటెంట్ కు కూడా కామెడీ కోటింగ్ ఇచ్చాడు ఈ దర్శకుడు. “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” సినిమాలో విన్నింగ్ పాయింట్ ఇదే. మొదటి 20 నిమిషాలు బోర్ కొట్టించినప్పటికీ, మిగతా సినిమా ఎంటర్ టైన్ చేస్తుంది.

ఫస్టాఫ్ రేంజ్ లో సెకెండాఫ్ లేనప్పటికీ.. క్లయిమాక్, ప్రీ-క్లయిమాక్స్ లో ఎమోషనల్ పార్ట్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది. తెలిసిన కథ అయినప్పటికీ, నెక్ట్స్ ఏం జరుగుతుందో ఈజీగానే ఊహించుకున్నప్పటికీ.. సినిమాను ఆసాంతం చూసేలా చేసింది ఈ ఎమోషనల్ కంటెంట్ మాత్రమే.

అలా అని సినిమా మొత్తం సూపర్ గా ఉందని చెప్పలేం. ఇంతకుముందే చెప్పుకున్నట్టు అక్కడక్కడా బోర్ కొట్టింది. సెకండాఫ్ లో కొన్ని అసందర్భ సన్నివేశాలు పడ్డాయి. సంగీతం అంతంతమాత్రంగానే ఉంది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా పండలేదు.

వీర్యదానం కాన్సెప్ట్ మనకు కొత్తకాదు. ఇంతకుముందు సుమంత్ ఓ సినిమా చేశాడు. అయితే వీర్యదానం కోసం హీరోను హీరోయిన్ పడేయడం అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. చాలా రొమాంటిక్-లవ్ సినిమాలకు భిన్నమైన పాయింట్ ఇది. ఇక అసలు మేటర్ తెలియని హీరో, హీరోయిన్ ను ఇంప్రెస్ చేయడం కోసం పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. నవీన్ స్టాండప్ కామెడీ దీనికి బోనస్. అయితే స్టాండప్ కామెడీ పార్ట్ లో చేసిన కామెడీ కంటే, క్యారెక్టర్ పరంగా నవీన్ చేసిన కామెడీ ఎక్కువ నవ్వు తెప్పిస్తుంది.

అతడి యాక్టింగ్ టోటల్ సినిమాకే హైలెట్. అనుష్క లాంటి హీరోయిన్ ను కూడా కొన్నిచోట్ల అతడు డామినేట్ చేశాడు. అంతేకాదు, ఈ పాత్రను ఇతడు తప్ప మరొకరు చేయలేరేమో అనిపిస్తుంది. ఇక అనుష్క కూడా ఎప్పట్లానే బాగా చేసింది. అయితే ఆమె లుక్స్ లో, బాడీ లాంగ్వేజ్ లో చలాకీతనం లోపించింది. సినిమా మొత్తం ఆమె లుక్స్, యాక్టింగ్ ను గమనిస్తే.. ఆమె చాలా జాగ్రత్తగా నటిస్తోంది అనిపిస్తోంది. మురళీశర్మ, తులసి, హర్షవర్థన్, సోనియా, అభినవ్ గోమటం తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ గా చూసుకుంటే, ఇంతకుముందే చెప్పుకున్నట్టు రధన్ అందించిన పాటలు బాగాలేవు. నేపథ్య సంగీతం ఓకే. నీరవ్ షా కెమెరాపనితనం, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగున్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మాతల ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా … “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” సినిమా ఓ టైమ్ పాస్ మూవీ. అక్కడక్కడ స్లోగా నడిచే ఈ సినిమాను.. నవీన్ పొలిశెట్టి యాక్టింగ్, కామెడీ కోసం ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.

బాటమ్ లైన్: కామెడీ శెట్టి

By M Patnaik

 

More

Related Stories