
కొత్త స్టోరీ లైన్స్ అనుకోవడం వేరు. ఆ లైన్స్ కు తగ్గట్టు కథ – స్క్రీన్ ప్లే రాసుకోవడం వేరు. మొదటి పని కొంత సులువు. రెండో పని చాలా చాలా కష్టం. “మిస్టర్ ప్రెగ్నెంట్” సినిమా లైన్ చాలా కొత్తది. ఓ పురుషుడు గర్భం దాల్చడం అనే పాయింట్ చాలా కొత్తగా ఉంది. బాలీవుడ్ లో ఓ సినిమా వచ్చినప్పటికీ, టాలీవుడ్ ప్రేక్షకులకు ఇది చాలా కొత్త. అయితే దీన్ని అంతే కొంతగా చెప్పారా లేదా చూద్దాం. ముందుగా కథ ఏంటో తెలుసుకుందాం…
గౌతమ్ (సోహెల్) ఓ అనాధ. మంచి టాటూ ఆర్టిస్ట్ కూడా. ఎక్కడ టాటూ కాంపిటిషన్ ఉన్నా అక్కడ అతడే గెలుస్తాడు. ఈ క్రమంలో అతడికి శత్రువులు కూడా పెరుగుతారు. కథలో ఇదో చిన్న కోణం. ఇక అసలు విషయానికొస్తే, గౌతమ్ ను కాలేజ్ రోజుల నుంచి ప్రేమిస్తుంది మహి (రూప). కానీ గౌతమ్ మాత్రం పట్టించుకోడు. ఒక టైమ్ లో మాత్రం తప్పతాగి, ఓ కండిషన్ పెట్టి మహి ప్రేమను అంగీకరిస్తాడు. మహికి పిల్లలంటే చాలా ఇష్టం. కానీ గౌతమ్ మాత్రం, పిల్లలు వద్దనుకుంటేనే ప్రేమ-పెళ్లి అంటాడు. దీంతో గౌతమ్ కోసం మహి తన ఇష్టాన్ని వదిలేస్తుంది. పేరెంట్స్ ను కూడా కాదని పెళ్లి చేసుకుంటుంది.
అలా పెళ్లితో ఒకటైన గౌతమ్-మహి, ఆ తర్వాత అనుకోని పరిస్థితులు ఫేస్ చేస్తారు.అనుకోకుండా మహి గర్భందాలుస్తుంది. ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత గౌతమ్ ఏం చేశాడు? అసలు గౌతమ్ ఎందుకు పిల్లల్ని వద్దనుకుంటాడు? అతడి ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఆమె అబార్షన్ కు నో చెప్పి, తనే గర్భాన్ని మోయాలని ఎందుకు డిసైడ్ అవుతాడు? ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ కథ.
నిజానికి ఇది మంచి ప్రయోగమే. మగాడు గర్భం దాల్చడం వినడానికి వింతగానే ఉంది. చూడ్డానికి కూడా కొట్టగానే ఉంది. ఐతే, ఈ సినిమాలో సినిమాలో మగాడు గర్భం దాల్చడమే కొత్త విషయం, మిగతాదంతా సాధారణ వ్యవహారం.
మగాడు ఎలా గర్భందాల్చగలడు? ఈ విషయాన్ని క్లియర్ చేయడానికి, ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడానికి దర్శకుడు శ్రీనివాస్ ప్రయత్నించాడు. సుహాసిని పాత్ర ద్వారా అది సక్సెస్ ఫుల్ గా ముగించాడు. అలా సైంటిఫిక్ గా జస్టిఫికేషన్ ఇచ్చిన దర్శకుడు.. అలాంటి మిస్టర్ ప్రెగ్నెంట్ సామాజికంగా ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నాడనే విషయాన్ని సెకండాఫ్ లో చర్చించాడు.
ఫస్టాఫ్ మొత్తం టాటూ, లవ్, మంచి సాంగ్, హీరో ఎందుకు భార్య గర్భాన్ని మోయాలనుకుంటున్నాడు లాంటి అంశాలతో నడిపాడు దర్శకుడు. సెకండాఫ్ కు వచ్చేసరికి సామాజికంగా గర్భం దాల్చిన మగాడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడో చూపించారు. అయితే మరీ లోతుగా వెళ్లకుండా.. చిన్న కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఆ ఎపిసోడ్స్ ను లాగించేశారు. మీడియా యాంగిల్ కూడా చొప్పించారు.
సరిగ్గా ఈ చర్యే, సినిమాపై మిక్స్ డ్ ఫీలింగ్ కు దారితీసింది. సన్నివేశాల్ని చెప్పే క్రమంలో దర్శకుడు తనకు ఏది అనుకూలమే ఆ దాని ఎంచుకున్నాడు. ఇంకా చెప్పాలంటే చాలా ఎపిసోడ్స్ లో సేఫ్ గేమ్ ఆడాడు. కమర్షియల్ టచ్ కోసం ప్రయత్నించాడు. ఇంత సీరియస్ సబ్జెక్టుకు అలాంటి సన్నివేశాలు సూట్ అవ్వలేదు. మరీ ముఖ్యంగా అందరూ ఊహించుకునేలా ఆ సన్నివేశాలు సాగడం సినిమాకు మైనస్.
సినిమాను ఎమోషనల్ గా చెప్పాలనుకునే దర్శకుడి ప్రయత్నం అక్కడక్కడ మాత్రమే మెప్పించింది. 9 నెలలు ఓ తల్లికి ఎంత భారంగా ఉంటుందో, అంత నరకాన్ని కూడా మాతృత్వం కోసం తల్లి ఎలా భరిస్తుందనే విషయాల్ని హార్ట్ టచింగ్ గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ క్రమంలో కొన్ని మంచి డైలాగ్స్ పడ్డాయి. సోహైల్ కూడా ఈ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. బిగ్ బాస్ లో అల్లరిచిల్లరిగా కనిపించిన సోహెల్.. ఇందులో ఎమోషనల్ డైలాగ్స్ చెబుతూ, సీరియస్ గా బాగా నటించాడు. డెలివరీ ఎపిసోడ్ లో కూడా అతడి నటన మెప్పిస్తుంది. హీరోయిన్ రూపతో పాటు, సుహాసిని వైవా హర్ష తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ గా సినిమా ఓకే అనిపిస్తుంది. నిర్మాతలు ఎక్కడా భారీ ఖర్చుకు పోలేదు. ఉన్నంతలో డీసెంట్ గా ఖర్చు చేశారు. శ్రవణ్ భరధ్వాజ్ సంగీతం బాగుంది. ‘ఓ సక్కనోడా..’ సాంగ్ ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది.
ఓవరాల్ గా ఓ కొత్త పాయింట్ ను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే మేకర్స్ ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. అయితే కొత్త పాయింట్ ను చెప్పడం కోసం రొటీన్ రూట్ ను ఎంచుకోవడం మాత్రం అంతగా మెప్పించదు. ఫలితంగా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా ఓ డీసెంట్ ఎటెంప్ట్ గా మాత్రమే మిగిలిపోతుంది.
బాటమ్ లైన్ – నొప్పులతో కూడిన ప్రసవం
Rating: 2.5/5
By M Patnaik