నాగార్జున అనేక చిత్రాలకు కీరవాణి సంగీతం ఇచ్చారు. నాగార్జునకి ఎక్కువ మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన సంగీత దర్శకుల్లో కీరవాణిది అగ్రస్థానం. ఇప్పుడు “నా సామి రంగా” చిత్రానికి కూడా కీరవాణి సంగీతం ఇచ్చారు.
“ప్రెసిడెంటు గారి పెళ్ళాం సినిమాలా ఇది కూడ ఘన విజయం సాధిస్తుంది. రెండూ గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రాలే. రెండూ వినోదాత్మక చిత్రాలే. తెలుగు సంప్రదాయం, సంక్రాంతి పండగ కళ ఉట్టిపడేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. సంగీతం కూడా ఫ్రెష్ గా వుంటుంది,” అని చెప్పారు కీరవాణి ఈ మూవీ గురించి.
ఈ సినిమాలో కీరవాణి కూడా ఒక పాట రాశారు. “మొత్తం పాటలు చంద్రబోస్ గారే రాశారు. నేను అలా చిన్న పాట రాశా. అంతే,” అని వివరించారు కీరవాణి. ఇటీవలే కీరవాణి స్వరపర్చిన “నాటు నాటు” పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఐతే ఆస్కార్ అవార్డు తన కొత్త సినిమాలకు ఎలాంటి హెల్ప్ చెయ్యదని అంటున్నారు కీరవాణి.
మరికొన్ని ముచ్చట్లు… ఆయన మాటల్లోనే…
ఇటీవల నచ్చిన సంగీతం?
“యానిమల్ పాటలు బాగున్నాయి. జైలర్ నేపధ్య సంగీతం నచ్చింది.”
రాజమౌళి కొత్త సినిమాలో పాటలు ఎలా ఉంటాయి?
రాజమౌళి కి ఫోన్ చేసి కనుక్కొండి. దానర్థం ఇంకా వర్క్ నా వరకూ రాలేదు. పాటల కంపొజిషన్ కి ఇంకా చాలా టైం ఉంది.
మళ్ళీ చిరంజీవి సినిమా చెయ్యడం…
అవును చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి గారి సినిమాకి సంగీతం ఇస్తున్నాను. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి.