
మనకు ఎన్టీఆర్, ఏఎన్నార్ లా మలయాళ సినిమా పరిశ్రమలో లెజెండరీ సూపర్ స్టార్ గా ప్రేమ్ నజీర్ స్థానం ప్రత్యేకం. మలయాళ సినిమాకి ఆయన ఒక ఐకాన్. 700కి పైగా సినిమాల్లో నటించారు ప్రేమ్ నజీర్. అందులో 500కి పైగా చిత్రాల్లో ఆయనే హీరో. అలాగే ఒకే హీరోయిన్ తో 110 పైగా సినిమాల్లో నటించి గిన్నీస్ రికార్డ్ పొందిన ఘనత ఆయనదే.
ఐతే, ఆయన తన చివరి దశలో మోహన్ లాల్ హీరోగా తన ఒక సినిమా తీయాలనుకున్నారట. స్వీయ దర్శకత్వంలో సినిమా తీసేందుకు ప్రేమ్ నజీర్ ప్లాన్ చేసుకొని మోహన్ లాల్ ని సంప్రదించారట. ఆ టైంలో టాప్ పొజిషన్ లో ఉన్న లాల్ ప్రేమ్ నజీర్ ని అవమానించారని, సినిమా చేసేందుకు నిరాకరించారని తాజాగా శ్రీనివాసన్ సంచలన ఆరోపణలు చేశారు.
మలయాళ సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడిగా, రచయితగా పేరొందిన శ్రీనివాసన్ చేసిన తాజా కామెంట్స్ కలకలం రేపాయి. మలయాళ సినిమా పరిశ్రమలో 1980 నుంచి ఇప్పటివరకు నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు మోహన్ లాల్. ఐతే, మోహన్ లాల్ ది హిపోక్రసి అని అంటున్నారు శ్రీనివాసన్.
ప్రేమ్ నజీర్ సినిమాని రిజెక్ట్ చేసిన మోహన్ లాల్ … ఆ తర్వాత ప్రేమ్ నజీర్ చనిపోయినప్ప్పుడు మాత్రం తాను ఆయన డైరెక్షన్ లో నటించాలని అనుకున్నాను అని కన్నీరు కార్చాడని శ్రీనివాసన్ అంటున్నారు.
ఐతే, మోహన్ లాల్ అభిమానులు మాత్రం శ్రీనివాసన్ మాటలు అబద్దమని చెప్తున్నారు. లాల్ స్థాయి తగ్గించేందుకు ఒక క్రమ పద్దతిలో కొందరు బురదజల్లుతున్నారు అనేది వారి మాట.