
కొన్ని కథలు పేపర్ పై రాసుకున్నప్పుడు భలేగా ఉంటాయి. వెంటనే సెట్స్ పైకెళ్లి షూటింగ్ చేసేద్దాం అనిపిస్తాయి. కానీ అలా రాసుకున్న స్టోరీలైన్స్ అన్నీ హిట్ సినిమాలు కాలేవు. లైన్ ఉంటే సరిపోదు, ఆ లైన్ చుట్టూ యాడ్-ఆన్స్ కావాలి. ఇలాంటి సింగిల్ లైన్ కథల్ని ఎంత ఎంగేజింగ్ గా చెబితే అంత బాగుంటాయి. సరిగ్గా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”లో అదే మిస్ అయింది.
మ్యారీడ్ లైఫ్ నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నావ్ అంటూ హీరోను ప్రశ్నిస్తుంది హీరోయిన్. హీరో చాలా సమాధానాలు చెబుతాడు. కానీ హీరోయిన్ కు తృప్తి ఉండదు. సరైన సమాధానం కనుక్కోమంటుంది. కరెక్ట్ సమాధానం చెబితే పడిపోతానంటూ హింట్ ఇస్తుంది. పెద్దలు ఎరేంజ్ చేసి పెట్టిన ఎన్నో పెళ్లిచూపులకు వెళ్లిన హీరో, హీరోయిన్ చెప్పిన ప్రశ్న గురించే ఆలోచిస్తుంటాడు. హీరో ఆ సమాధానం తెలుకోవడం, ఇతడే నాకు సరైనోడు అని హీరోయిన్ తెలుసుకోవడం ఈ సినిమా.
ఇలా ఓ పారాగ్రాఫ్ లో చెప్పుకుంటే ఈ సినిమా బాగుంది. కానీ రెండున్నర గంటలు నడిపించడమే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కు ఇబ్బందికరంగా మారింది. దీంతో అతడు కన్ఫ్యూజ్ అయి, ప్రేక్షకుల్ని కూడా కన్ఫ్యూజ్ చేశాడు. లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టుకున్న ఈ దర్శకుడు.. తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ “బొమ్మరిల్లు”, ఈమధ్య వచ్చిన “షాదీ ముబారక్”, అంతకంటే ముందొచ్చిన “హలో”, అప్పుడెప్పుడో వచ్చిన “పెళ్లిసందడి”లాంటి ఎన్నో సినిమాల్ని ఇందులో గుర్తుచేశాడు.
న్యూయార్క్ లో మంచిగా సెటిల్ అవుతాడు హీరో హర్ష. జీవితంలో అన్నీ ఉంటాయి అతడికి. ఒక్క భార్య తప్ప, మంచి లైఫ్ పార్టనర్ ను సెట్ చేసుకుంటే లైఫ్ సంపూర్ణమౌతుందని భావించి హైదరాబాద్ వస్తాడు. 20 రోజుల్లో మంచి లైఫ్ పార్టనర్ ను సెలక్ట్ చేసుకొని వెళ్లిపోవాలనేది అతడి ఆలోచన. అందుకు తగ్గట్టే హర్ష తల్లిదండ్రులు కూడా వరుసపెట్టి పెళ్లి సంబంధాలు రెడీ చేసి పెడతారు. అయితే ఈ క్రమంలో హీరోయిన్ విభ పెళ్లి సంబంధాన్ని మాత్రం జాతకాలు కుదరకపోవడంతో హర్ష తల్లిదండ్రులు పక్కనపెట్టేస్తారు.
కానీ విధి హీరో,హీరోయిన్లను కలుపుతుంది. హీరోయిన్ ఆటిట్యూడ్, ఆమె చేసే స్టాండప్ కామెడీ హీరోకు తెగ నచ్చేస్తుంది. ఆమెనే జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటాడు. హర్ష-విభా ఎలా తమ నిజమైన ప్రేమను గుర్తిస్తారు? దీనికోసం హర్ష ఏం చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ.
దర్శకుడిగా హిట్ కొట్టేందుకు మరోసారి తనకు ఎంతో ఇష్టమైన రొమాంటిక్-కామెడీ జానర్ నే ఎంచుకున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. ఇందులో తప్పులేదు. కాకపోతే ఈ క్రమంలో “బొమ్మరిల్లు” ఛాయలోనే కథని మొదలెట్టాడు. ఉదాహరణకు ప్రారంభ సన్నివేశాల్నే తీసుకుంటే.. “బొమ్మరిల్లులో” ఓ ఆంటీ లిఫ్ట్ ఇస్తే హీరో తన గోడు మొత్తం చెప్పుకుంటాడు. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” కూడా దాదాపు అంతే. రోడ్డుపై ఎదురుపడిన జంటకు తన కథ చెప్పుకుంటాడు. “బొమ్మరిల్లు”లో హీరో ఓ కన్ఫ్యూజింగ్ మైండ్ తో ఉంటాడు. ఇందులో కూడా హీరో కన్ఫ్యూజింగ్ మైండ్ తోనే ఉంటాడు. కాకపోతే బొమ్మరిల్లు టైమ్ లో ఫుల్ క్లారిటీతో ఉన్న దర్శకుడు.. ”బ్యాచిలర్” కు వచ్చేసరికి మాత్రం హీరోతో పాటు తను కూడా కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు.
ఫస్టాఫ్ మొత్తాన్ని హీరో పెళ్లిచూపులకు, హీరో-హీరోయిన్ల చిన్న పరిచయానికి అంకితం చేశాడు దర్శకుడు. ఫస్టాఫ్ లో చాలా భాగం “షాదీ ముబారక్” అనే సినిమాను తలపిస్తే, సెకండాఫ్ లో చాలా భాగం ఆ మధ్య అఖిల్-విక్రమ్ కుమార్ కలిసి చేసిన “హలో” అనే సినిమాను గుర్తుకుతెస్తుంది. ఇలా చాలా కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఎంతలా అంటే.. ఎవరైనా పెళ్లి ముహూర్తం పెట్టుకొని సంబంధాలు వెదుకుతారా? సంబంధం సెట్ అవ్వకముందే హీరో తల్లిదండ్రులు పెళ్లి షాపింగ్ మొత్తం చేసేస్తారు. ఇక వెన్నెల కిషోర్ ది మరో ప్రహసనం. సడెన్ గా సెకెండాఫ్ లో ప్రత్యక్షమౌతాడు. అప్పటివరకు ఎక్కడుంటాడో తెలీదు. ఇక అతడు చేసే ‘గే’ కామెడీకి సినిమాకు సంబంధమేంటో అర్థంకాదు.
హీరోయిన్ ను స్టాండప్ కమెడియన్ గా చూపించడం మాత్రమే కాస్త ఫ్రెష్ అనిపిస్తుంది తప్ప, మిగతాదంతా భాస్కర్ టెంప్లేట్ లోనే సాగుతుంది. ఇక చివర్లో రొమాన్స్ కు సంబంధించి వచ్చే ఓ పెద్ద సన్నివేశమైతే సహనానికి పరీక్ష పెడుతుంది. ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో కొన్ని ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. దీనికితోడు మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది.
అఖిల్-పూజా హెగ్డే మాత్రం తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. పూజా హెగ్డే అయితే కొన్ని చోట్ల మెస్మరైజ్ చేసి పడేసిందంతే. ఇతర తారాగణం అంతా జస్ట్ ఓకే. చెప్పుకోడానికి ఆమని,మురళీశర్మ, ప్రగతి, ఇషారెబ్బ, ఫరియా, సుడిగాలి సుధీర్.. ఇలా చాలామంది ఉన్నారు కానీ వాళ్ల మార్క్ చూపించలేకపోయారు.
టెక్నికల్ గా చూసుకుంటే గోపీసుందర్ మ్యూజిక్ హైలెట్. లెహరాయి, గుచ్చేగులాబీ పాటలు మనసుకు గుచ్చుకుంటాయి.
ఫైనల్ పాయింట్:
ఓవరాల్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను గోపీసుందర్ మ్యూజిక్, కొన్ని ఫీల్ గుడ్ రొమాంటిక్ మూమెంట్స్ కోసం చూడొచ్చు. ఇవి మినహా మిగతాదంతా దారితప్పింది.
Rating: 2.75/5
– పంచ్ పట్నాయక్