
ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం.. “కల్కి 2898 AD”. తెలుగులో ఇప్పటివరకు ఎవరూ టచ్ చెయ్యని కథని చెప్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇంతకుముందు “మహానటి” సినిమాతో పేరు, విజయం రెండూ పొందిన నాగ్ అశ్విన్ ఈ సినిమాని భారీగా తీస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ లో “2898 AD” అని ఉంది కాబట్టి కథ మొత్తం భవిష్యత్ లో ఉంటుంది అనుకోవద్దు అంటున్నారు ఈ దర్శకుడు.
“ఈ కథ మహాభారత కాలంలో మొదలవుతుంది. శ్రీకృష్ణుడి అవతారం ముగిసిన తర్వాత కథ మొదలై 2898ADలో ముగుస్తుంది. మొత్తం 6వేల సంవత్సరాల కాలం ఈ కథలో కనిపిస్తుంది,” అని నాగ్ అశ్విన్ వెల్లడించారు.
ప్రభాస్ హీరో అయినా ఇందులో ఇతర నటీనటులు కూడా కనిపిస్తారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఇక ఇతర కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తున్నారు. హీరోయిన్లుగా దీపిక పదుకోన్, దిశా పటాని కనిపిస్తారు.
మే 9, 2024న విడుదల కానున్న “కల్కి”లో సైన్స్ ఫిక్షన్, పౌరాణిక, ఫాంటసీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో దేవుళ్ళ అవతారాల ప్రస్తావన ఉంది. మరి శ్రీకృష్ణుడిగా ఎవరు నటిస్తారో చూడాలి.