
ఆంధ్రప్రదేశ్ థియేటర్ లలో టికెట్ ధరలను ఆ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. దీనిపై స్పందించేందుకు సీనియర్ హీరో నాగార్జున నిరాకరించారు. ఎందుకంటే… అది రాజకీయ రగడనంట.
నాగార్జున, ఆయన కుమారుడు నాగ చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన మీడియా ఈవెంట్ లో టికెట్ ధరల గురించి ఆయన అభిప్రాయం అడిగారు జర్నలిస్టులు.
దానికి నాగార్జున స్పందన విచిత్రంగా ఉంది. “ఇది సినిమా వేడుక… ఇక్కడ రాజకీయ అంశాలు మాట్లాడను” అని సమాధానం ఇచ్చారు. సినిమా టికెట్ ఇష్యుని రాజకీయ సమస్య అని నాగార్జున తేల్చి పారేశారు. ఆంధ్రప్రదేశ్ లో తగ్గిన టికెట్ ధరలు మీ సినిమా కలెక్షన్లపై కూడా ప్రభావం చూపుతాయి కదా అని ప్రశ్నిస్తే.. ధరలు ఎక్కువుంటే కొంచెం ఎక్కువ వస్తుందేమో అంతకుమించి ఏమి లేదు అని కట్ చేశారు.
ఐతే, సోషల్ మీడియాలో నాగార్జునకి ట్రోలింగ్ సెగ బాగా ఉంది. ఇప్పుడు ఈయన అభిప్రాయం కోసం రాజకీయ వేడుక నిర్వహించాలా అంటూ చురకలు వేస్తున్నారు.
నాగార్జున, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి స్నేహబంధాలున్నాయి. కాబట్టి నాగార్జున సహజంగానే వై.ఎస్.జగన్ ప్రభుత్వం ఇబ్బంది పడే ఈ అంశంపై మాట్లాడరు అనేది అందరికి తెలిసిందే.