
‘వరుడు కావలెను’లో లవర్ బాయ్. శుక్రవారం విడుదలవుతోన్న ‘లక్ష్య’లో విలువిద్యకారుడు. పాత్రలకు తగ్గట్లుగా మారిపోవడం అలవాటు చేసుకుంటున్నారు నాగశౌర్య. ఈ సినిమా కోసం ఏకంగా 8 ప్యాక్ బాడీ పొందాడు.
శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. రిలీజ్ నేపథ్యంలో నాగశౌర్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు…
– ‘వరుడు కావలెను’ లవ్ స్టోరీ. నాకు తెలిసిన జోనర్. ‘లక్ష్య’ వేరు. స్పోర్ట్స్ నేపథ్యంలో చాలా కథలు నా ముందుకు వచ్చాయి. కానీ అందులో వినగానే నచ్చిన మూవీ… ఇదే. దర్శకుడు సంతోష్ నాలుగు గంటల పాటు ఫస్ట్ హాఫ్‌ను నెరేట్ చేసినప్పుడే నిర్ణయించుకున్నాను సినిమా చెయ్యాలని.
– ఇది ఆర్చరీ బ్యాక్డ్రాప్ లో సాగే కథ. ఈ రోజు విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌లోనూ రామ్ చరణ్ గారు బాణంతో కనిపించారు. మనకు ఎప్పటినుంచో తెలిసినదే విలువిద్య. దాన్ని కొత్తగా చెప్పాం.
– కథ ప్రకారం హీరో తాను మారిపోయాడని చూపించాలి. ఆ మార్పును చూపించేందుకు… బాడీని మార్చాను. సిక్స్, ఎయిట్ ప్యాక్ బాడీ సాధించాను. దాని కోసం తొమ్మిది రోజులు నీళ్లు కూడా ముట్టుకోలేదు.
– ‘వరుడు కావలెను’ విజయం సాదించింది. కానీ ఆ సినిమా తరువాత సంబంధాలేవీ రాలేదు. గత లాక్డౌన్‌లోనే పెళ్లి పెళ్లి అంటూ ఇంట్లో చంపేశారు. ఇంకోసారి లాక్డౌన్ వస్తే పెళ్లి చేసుకుంటానేమో.