సీనియర్ హీరోల సహకారం!


మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున… ఇద్దరూ 60 ప్లస్. ఇద్దరూ సీనియర్ హీరోల. వాళ్ళ పిల్లలు హీరోలయ్యారు. సో… ఇప్పుడు వారి మధ్య పోటీ లేదు. ఇంకా చెప్పాలంటే నిజ జీవితంలో వాళ్ళు మంచి స్నేహితులు. కలిసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతారు. అలాంటి బంధం ఉంది కాబట్టే.. ఒకే రోజు తమ సినిమాలు విడుదల అవుతున్నా ఒకరి సినిమా గురించి మరొకరు మంచి మాటలు చెప్తున్నారు.

అక్టోబర్ 5న ‘గాడ్ ఫాదర్’ విడుదల కానుంది. అదే రోజు నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ వస్తోంది. “నా సినిమా గాడ్ ఫాదర్ తో పాటు విడుదల అవుతున్న నాగార్జున మూవీ కూడా బాగా ఆడాలి. అది కూడా చూడండి,” అని చిరంజీవి చెప్తున్నారు. అలాగే, చిరంజీవి సినిమా చూసి నా సినిమాకి రండి అంటున్నారు నాగార్జున.

ఇలా ఈ సీనియర్ హీరోలిద్దరూ ఒకరికి ఒకరు సహకారం ఇచ్చుకుంటున్నారు. ఒకరి సినిమాని మరొకరు ప్రమోట్ చేస్తున్నారు.

ఇద్దరికీ ఈ సినిమాలు ఆడడం ముఖ్యమే. చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఈ వేసవిలో విడుదలై ఢమాల్ అంది. ఇక ఇటీవల నాగార్జున నటించిన యాక్షన్ చిత్రాలు ఏవి ఆడలేదు. ఈ సినిమా ఆడితే ‘జింక్స్’ అనేది పోతుంది. అందుకే, ఈ సినిమాల విజయం ఇద్దరికీ అవసరమే. మరి విజయదశమి నాడు విడుదలవుతున్న ఈ చిత్రాలతో వీళ్ళు విజయం సాధిస్తారా అనేది చూడాలి.

 

More

Related Stories