మాట తప్పినా థ్రిల్ ఇచ్చాడు

Bigg Boss Telugu 4 – Episode 29

నాగార్జున మరోసారి మాట తప్పాడు. డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని సస్పెన్స్ క్రియేట్ చేసి మరోసారి తుస్సుమనిపించాడు. అయితే డబుల్ ఎలిమినేషన్ లేకపోయినా, రెట్టింపు థ్రిల్ ఇచ్చి షో రక్తికట్టించాడు నాగ్. ఎంతో ఉత్కంఠ, మరెంతో ఫన్ మధ్య ఆదివారం ఎపిసోడ్ జరిగింది.

Bigg Boss Telugu 4 – Episode 29 హైలెట్స్ ఓసారి చూస్తే..శనివారం ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ తో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. హౌజ్ నుంచి వెళ్లిపోయే ముందు ఎవరో ఒకర్ని ఎలిమినేషన్ కు నామినేట్ చేసే అవకాశాన్ని ఇస్తూ వచ్చాడు నాగ్. కానీ ఈసారి మాత్రం స్వాతిదీక్షిత్ కు ఆ  ఛాన్స్ ఇవ్వలేదు. కేవలం కొన్ని ట్యాగ్ లైన్ కార్డులు చూపించి, వాటిలో ఎవరికి ఏ ట్యాగ్ లైన్ ఇస్తే బాగుంటుందో చెప్పించాడు.

ఈ క్రమంలో అమ్మ రాజేశేఖర్ కు “నమ్మకద్రోహి” అనే ట్యాగ్ ఇచ్చింది స్వాతి. సుజాతకు ‘పుకార్ల పుట్ట’, లాస్యకు ‘అవకాశవాది’, నోయల్ కు ‘గుడ్డిగా నమ్మేవాడు’, కుమార్ సాయికి ‘నక్కతోక తొక్కినోడు’, అరియానాకు ‘ఓవర్ కాన్ఫిడెన్స్’, హారికకు ‘ట్యూబ్ లైట్’ ట్యాగ్స్ ఇచ్చి.. పరోక్షంగా తన మనసులో వాళ్లపై ఉన్న అభిప్రాయాల్ని కక్కేసింది.

ఇలా 2-3 గేమ్స్ ఆడించిన తర్వాత ఫైనల్ గా ఎలిమినేషన్ ప్రాసెస్ కు వచ్చాడు నాగ్. ఈ రౌండ్ లో ఆరుగురు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అభిజిత్, లాస్య, మెహబూబ్, కుమార్ సాయి, హారిక, సొహైల్.. ఓ రేంజ్ లో టెన్షన్ పడ్డారు. మెహబూబ్ అయితే దాదాపు మెంటల్లీ ఫిక్స్ అయినట్టే కనిపించాడు. ఈ క్రమంలో 6 నంబర్ బోర్డులు ఏర్పాటుచేసి, ఎవరు ఏ నంబర్ బోర్డు వద్ద నిలబడాలో డిసైడ్ చేసుకోమన్నాడు నాగ్.

ఆరుగురు తమలోతాము చర్చించుకొని ఒక్కో నంబర్ వద్ద నిల్చుకున్నారు. కాస్త టెన్షన్ పెట్టిన నాగ్.. ఆరుగురు సేవ్ అయినట్టు ప్రకటించాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలా డబుల్ నామినేషన్ విషయంలో నాగార్జున మరోసారి మాట తప్పినప్పటికీ.. ఆదివారం ఎపిసోడ్ తో చాలా థ్రిల్ అందించాడు.

Related Stories