నాగార్జున చెప్పిన చెట్టు కథ

Nagarjuna in Bigg Boss 4

హీరో నాగార్జున ఇంట్లో ఓ పెద్ద రాయల్ పామ్ చెట్టు ఉంది. ఎంత పెద్దదంటే దాని ఎత్తు దాదాపు 65 అడుగులు. జూబ్లిహిల్స్ ఏరియాలో అతిపెద్ద చెట్లు లెక్క తీస్తే అందులో టాప్-3లో ఈ చెట్టు కూడా ఉంటుంది. ఈ చెట్టు వెనక చాలా పెద్ద కథే ఉందంటున్నాడు నాగ్..

“జూబ్లీ చెక్ పోస్ట్ పై నుంచే మా ఇంటికి వెళ్లాలి. ఎప్పుడెళ్లినా చెక్ పోస్ట్ దగ్గర ఓ పెద్ద రాయల్ పామ్ చెట్టును చూస్తూ ఉండేవాడ్ని. దాదాపు 25 అడుగులు ఉండేది. ఓసారి అక్కడ ఇంటి పని మొదలుపెట్టారు. క్రేన్ తెచ్చి చెట్టు పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకో నా మనసుకు బాధ అనిపించింది. వెంటనే కారు ఆపి అక్కడికి వెళ్లాను. ఒక్క రోజు ఆగమని చెప్పాను. నాకు తెలిసిన నిపుణులకు చెప్పి.. వేళ్లతో సహా ఆ చెట్టును తీసి, నా ఇంట్లో పెట్టుకున్నాను. ఇప్పుడది దాదాపు 65
అడుగులు పెరిగింది.”

ఇలా ఆ చెట్టు వెనక  కథను బయటపెట్టాడు నాగ్. తన ఇంట్లో ఉన్న ఆ చెట్టును చూసినప్పుడల్లా ఏదో తృప్తి కలుగుతుందంటున్నాడు నాగ్.

అంతేకాదు.. తన ఎన్-కన్వెన్షన్ వద్ద ఉన్న మర్రిచెట్టుపై కథ కూడా చెప్పాడు నాగ్. ఓసారి రాజమండ్రి షూటింగ్ కు వెళ్లినప్పుడు కేవలం అడుగు ఎత్తున్న మర్రి మొక్కను ఇష్టపడి కొనుక్కున్నానని, అదిప్పుడు ఎన్-కన్వెన్షన్ వద్ద చాలా అందంగా తయారైందని చెప్పుకొచ్చాడు.

Related Stories