
Bigg Boss Telugu 4 – Episode 43
బిగ్ బాస్ హౌజ్ లో మరో కంటెస్టెంట్ కు నాగార్జున నుంచి అభయహస్తం అందింది. ఇప్పటికే గంగవ్వకు ఛానెల్ యాజమాన్యంతో కలిసి ఇల్లు కట్టి ఇస్తానని మాటిచ్చిన నాగార్జున, ఇప్పుడు కుమార్ సాయికి కూడా మరో హామీ ఇచ్చాడు. తాజాగా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన ఈ కమెడియన్ కు కచ్చితంగా స్టోరీ వింటాననే మాటిచ్చాడు నాగ్.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద హౌజ్ లోకి అడుగుపెట్టినప్పుడు 3 కోరికలు బయటపెట్టాడు కుమార్ సాయి. వాటిలో ఒకటి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలవడం. అది సాధ్యం కాలేదు. ఇక రెండోది తను బయటకొచ్చేసరికి కరోనా వ్యాక్సిన్ రావాలి. అది కూడా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇక మూడోది ఎలాగైనా నాగార్జునకు తను రాసుకున్న కథ వినిపించడం. ఈ మూడోది కూడా సాధ్యం కాదని అంతా అనుకున్నారు.
కానీ నాగార్జున మాత్రం కుమార్ సాయికి మాటిచ్చాడు. కథ వినడానికి తప్పకుండా టైమ్ కేటాయిస్తానని సభాముఖంగా ప్రకటించాడు.
నిజంగా కుమార్ సాయి తన కథతో మెప్పిస్తే అతడికి డైరక్షన్ ఛాన్స్ ఇవ్వడానికి కూడా వెనకాడడు నాగ్. ఇందులో ఆశ్చర్యపోవడానికేం లేదు కూడా. నాగార్జున కెరీర్ ఒకసారి చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమౌతుంది.