
నాగార్జున గత ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వరుసగా సినిమాలు పోవడం ఒక కారణం. మరోటి సరైన కథలు దొరకడం లేదు. ఇప్పుడు తాను ఎలాంటి సినిమాలు చేస్తే చూస్తారు అన్న విషయంలో నాగార్జునకి స్పష్టత లేదు. అందుకే, ఏడాది కాలంగా ఒక సినిమాని సెట్ పైకి తీసుకురాలేదు.
ఐతే, “ధమాకా”తో పాటు “నేను లోకల్” వంటి హిట్ చిత్రాలకు కథలు, మాటలు అందించిన బెజవాడ ప్రసన్న కుమార్ చెప్పిన కథ నాగార్జునకి బాగా నచ్చింది. ఆ కథ నచ్చి అతనికే దర్శకుడిగా ఓకె చెప్పారు నాగ్. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో బెజవాడ ప్రసన్న కుమార్ కి నో చెప్పారు.
ఆ స్థానంలో మరో దర్శకుడిని తీసుకున్నారట. బెజవాడ ప్రసన్న కుమార్ కి నాగ్ కి చెడింది. దాంతో, దర్శకుడిని మార్చారు నాగార్జున. ఈ కొత్త దర్శకుడి స్క్రిప్ట్ పూర్తి చేసేందుకు టైం పట్టేలా ఉంది.
సో, ఈ గ్యాప్ లో నాగార్జున మళ్ళీ బిగ్ బాస్ హోస్ట్ గా రానున్నారు. వచ్చే నెలలోనే బిగ్ బాస్ 7వ సీజన్ స్టార్ట్ అవుతోంది. అలా నాగార్జున బుల్లితెరపై కనిపిస్తారు. వెండితెరపై దర్శనమివ్వాలి అంటే 2024 వరకు ఆగాల్సిందే.