రాజమౌళి చిత్రంలో నాగార్జున?

Nagarjuna

అక్కినేని నాగార్జున ఇటీవలే ఒక డీసెంట్ సక్సెస్ అందుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఆయనకు ఒక మోస్తరు విజయం దక్కింది “నా సామి రంగ” చిత్రంతో. ఇక ఇప్పుడు ధనుష్ హీరోగా రూపొందుతోన్న చిత్రంలో నాగార్జున ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. శేఖర్ కమ్ముల తీస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది.

మరోవైపు, ఇప్పుడు ఇంకో ప్రచారం మొదలైంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తీసే మెగా మూవీలో నాగార్జున కూడా ఒక పాత్ర పోషించే అవకాశం ఉంది అనే మాట నడుస్తోంది.

రాజమౌళి ఇంతవరకు నాగార్జునతో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. కానీ రాజమౌళి – కీరవాణి కుటుంబానికి, నాగార్జునకి మంచి అనుబంధం ఉంది. నాగార్జున అనేక చిత్రాలకు కీరవాణి సంగీతం అందించారు. అలాగే, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ డైరెక్టర్ గా తీసిన “రాజన్న” చిత్రంలో నాగార్జున కథానాయకుడు.

ఈ “రాజన్న” చిత్రంలో యాక్షన్ సన్నివేశాలను రాజమౌళి డైరెక్ట్ చేసిన మాట వాస్తవమే. ఇక ఇప్పుడు మహేష్ బాబు హీరోగా రాజమౌళి తీసే సినిమాలో ఒక కీలక పాత్ర కోసం నాగార్జునని తీసుకునే ఆలోచన చేస్తున్నారట.

ఆ మధ్య నాగార్జున కూడా మహేష్ బాబుతో నటించాలని ఉంది అని అన్నారు. “మీ నాన్నతో కలిసి నటించాను. మీ నాన్న మా నాన్నతో నటించారు. నీతో కూడా నటించాలని ఉంది. ఆ పరంపరను కొనసాగిద్దాం,” అంటూ నాగార్జున చేసిన ట్వీట్ కి మహేష్ బాబు సమాధానం ఇచ్చారు. త్వరలోనే కలిసి నటిద్దాం సార్ అన్నారు మహేష్ బాబు.

చూస్తుంటే ఇప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఈ కాంబినేషన్ సెట్ అయ్యేలా ఉంది.

Advertisement
 

More

Related Stories