
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’కి ఇప్పటివరకు క్రేజ్ రాలేదు. విడుదలైన టీజర్ పెద్దగా ఆకట్టుకోలేదు. పైగా ఇది రీమేక్ చిత్రం. మలయాళంలో సూపర్ హిట్టైన ‘లూసిఫెర్’ ఆధారంగా రూపొందింది. ఆ సినిమాని తెలుగువాళ్ళూ చూసేశారు. ఎందుకంటే, అది తెలుగులో కూడా డబ్ అయింది. ఐతే, ఎంతైనా ఇది మెగాస్టార్ మూవీ. కాబట్టి దీనికి ఒక స్థాయిలో అయినా హంగామా ఉండాలి. అదే కొరవడింది ఈ సినిమాకి.
ఐతే, ఎన్నడూ లేనిది ఈ సారి మెగాస్టార్ అభిమానులు కూడా ఈ సినిమా మేకర్స్ పై చిరాకు పడుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇప్పటివరకు సరైన ప్లానింగ్ తో ప్రొమోషన్ చెయ్యడం లేదనేది వారి కంప్లైంట్.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటించారు. సల్మాన్ గెస్ట్ రోల్ వల్ల సినిమాకి ఎంత ఉపయోగం ఉంటుందో తెలీదు కానీ ప్రొమోషన్ లేకపోతే చిరంజీవి సినిమాని కూడా పట్టించుకోరు. అందుకే, అభిమానులు ఫైర్ అవుతున్నారని చెప్పొచ్చు.
మరోవైపు, నాగార్జున మాత్రం దూకుడు చూపుతున్నారు. ‘గాడ్ ఫాదర్’తో పాటే నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ కూడా అక్టోబర్ 5న విడుదల కానుంది. టీజర్లు, ట్రైలర్లు, పాటలు, మర్చయిండేజ్… ఇలా నాగార్జున మాత్రం హడావిడి చేస్తున్నారు. రిలీజ్ డేట్ కూడా మార్చనని చెప్తున్నారు నాగ్.