
నాని ప్రస్తుతం “హాయ్ నాన్న” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకొంది. ఆ తర్వాత దర్శకుడు వివేక్ ఆత్రేయతో మరో సినిమా చేయనున్నారు. డివివి దానయ్య ఈ సినిమాకి నిర్మాత.
ఐతే, ఈ సినిమా కథ విషయంలోనే నాని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు టాక్. “బ్రోచేవారెవరురా”, “అంటే సుందరానికి” వంటి సినిమాలు తీసిన వివేక్ ఆత్రేయ ఈసారి నానికి ఒక యాక్షన్ డ్రామాకి సరిపడే కథ చెప్పించి ఒప్పించారట. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఇంకా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. సెకండాఫ్ విషయంలో నానిని వివేక్ ఆత్రేయ పూర్తిగా కన్విన్స్ చెయ్యలేదని అంటున్నారు.
గతంలో నాని “వి” వంటి యాక్షన్ సినిమాలు చేసినప్పుడు సెకండాఫ్ విషయంలో తప్పిదాలు జరిగాయి. అలాగే, ఇదే దర్శకుడు నానితో ఇంతకుముందు తీసిన “అంటే సుందరానికి” సెకండాఫ్ బోర్ కొట్టించింది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొనే పూర్తిగా కన్విన్సింగ్ గా లేని ఇదే స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వెళ్లాలా లేక దర్శకుడికి మరింత టైం ఇచ్చి మొత్తం సెకండాఫ్ తిరిగి రాయించాలా అన్న విషయంలో నాని తేల్చుకోలేక పోతున్నారు అని సమాచారం.
నాని ఒక కథని, ఒక దర్శకుడిని నమ్మితే అతనికి పూర్తిగా అండగా ఉంటారు. ఇటీవలే కొత్త దర్శకుడు “దసరా”తో భారీ విజయాన్ని అందుకున్నారు నాని. అదే ఊపుని కొనసాగించాలంటే కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. అందుకే, నానికి ఈ డోలాయమానం.