నారప్ప మూవీ రివ్యూ

Narappa

రీమేక్ తీయడం కత్తిమీద సాము లాంటి వ్యవహారం అని ఎందుకంటారో తెలుసా? ఉన్నదున్నట్టు తీస్తే కాపీ-పేస్ట్ అంటారు, మార్పులు చేసే సాహసం చేయలేకపోయారంటారు. ఏదైనా మార్పులు చేసి తీస్తే, చెడగొట్టారని అంటారు. అందుకే ఎందుకొచ్చిన ఇబ్బందంటూ చాలామంది మేకర్స్ రీమేక్స్ ను మక్కికిమక్కి దింపే ప్రయత్నం చేస్తారు. దగ్గుబాటి కాంపౌండ్ ఈ విషయంలో అస్సలు రిస్క్ తీసుకోదు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల “నారప్ప” సినిమాను ఉన్నదున్నట్టు తీసే ప్రయత్నం చేశాడు.

అయితే తమిళ నారప్పలోని ఎమోషన్ ను అతడు పూర్తిస్థాయిలో తెలుగులో క్యారీ చేయలేకపోయాడనేది వాస్తవం. ఇంటర్వెల్ తర్వాతొచ్చే కొన్ని సన్నివేశాలు, ఫస్టాఫ్ ఫీల్ ను కాస్త చెడగొట్టాయి. అలా అని ద్వితీయార్థం అస్సలు బాగాలేదని కాదు. ఆ ఎఫెక్టివ్ నెస్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఒరిజినల్ వెర్షన్ తో పోల్చిచూస్తే, “నారప్ప”లో కొన్ని సీన్లను అడ్డాల చాలా ఫ్లాట్ గా తీశాడు. అమ్ము అభిరామితో యంగ్ నారప్ప సన్నివేశాలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

కథ విషయానికొస్తే.. అనంతపురంలోని ఓ పల్లెటూరిలో భార్య సుందరమ్మ (ప్రియమణి) ముగ్గురు పిల్లలతో ఓ సాధారణ రైతు జీవితం గడుపుతుంటాడు నారప్ప (వెంకటేష్). అనుకోకుండా నారప్ప పెద్ద కొడుకు ముని కన్నా (కార్తీక్ జీవరత్నం)తో ఆ ఊరి పెద్ద పండు స్వామి (నరేన్) పొలం విషయంలో గొడవ పడతాడు. తనపై ఎదురుతిరిగిన నిమ్న కులానికి చెందిన ముని కన్నాని తన మనుషులతో కిరాతకంగా చంపిస్తాడు పండు స్వామి.

తన తల్లి బాధ చూడలేక అన్నయ్య ని చంపిన పండు స్వామిని ఉద్వేగంతో చంపి తన పగ చల్లార్చుకుంటాడు సిన్నప్ప(రాఖీ). హత్య కేసు నుండి అలాగే పండుస్వామి మనుషుల నుండి కాపాడుకోవడం కోసం సిన్నప్పని తీసుకొని ఊరికి దూరంగా అడవిలోకి పారిపోతాడు నారప్ప. ఇంతకీ కొడుకుని చంపిన వారిపై నారప్ప ఎందుకు పగ తీర్చుకోలేదు..? ఎందుకు సాత్వికంగా ఉంటాడు ? అతని గతమేంటి ? చివరికి నారప్ప పండుస్వామి హత్య కేసు నుండి తన చిన్న కొడుకుని ఎలా కాపాడుకున్నాడది మిగతా కథ.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఒరిజినల్ తో నారప్ప కంపారిజన్స్ ను పక్కనపెడితే.. పెర్ఫార్మెన్సులు మాత్రం అదిరిపోయాయి. నారప్పగా వెంకీకి నూటికి నూరు మార్కులు వేసేయొచ్చు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో వెంకీ సీనియారిటీ కనిపిస్తుంది. బాడీ లాంగ్వేజ్, డైలాడ్ డెలివరీ, రాయలసీమ యాస చించేశాడు. ఒరిజినల్ వెర్షన్ తో ధనుష్ జాతీయ అవార్డ్ అందుకున్నాడు. ఆ స్థాయికి ఏమాత్రం తీసిపోదు మన వెంకీ నటన. అయితే యంగ్ నారప్ప లుక్ లో మాత్రం వెంకీ ఆకట్టుకోలేకపోయాడు. ఈ విషయంలో దర్శకుడు, అలాగే వెంకీ శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది.

ఇక మిగతా పాత్రల విషయానికొస్తే నారప్ప భార్య సుందరమ్మగా ప్రియమణి చక్కగా నటించింది. కాకపోతే ఆమె రాయలసీమ యాస సెట్ కాలేదు. ఇక నారప్ప పెద్ద కొడుకుగా కార్తీక్ రత్నం, చిన్నకొడుకుగా రాఖి బాగా చేశారు. వీళ్లలో రాఖి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాఖి ఎపిసోడ్ అదుర్స్. రావు రమేష్, రాజీవ్ కనకాల ఎప్పట్లానే తమ పాత్రలకు న్యాయం చేశారు.

ALSO READ: Narappa Review: Faithful remake

సహజంగా తీసిన యాక్షన్ సన్నివేశాలు మినహాయిస్తే, టెక్నికల్ గా ఈ సినిమా గురించి చెప్పుకోడానికేం లేదు. కెమెరామెన్, సంగీత దర్శకుడు ఒరిజినల్ మూవీ ఫీల్ ను అలా దించేశారు. ఇక దర్శకుడి విషయానికొస్తే ఎప్పట్లానే రైటింగ్ తో ఆకట్టుకున్నాడు అడ్డాల. అయితే అతడి దర్శకత్వ ప్రతిభ మాత్రం కొన్ని చోట్ల మెరవలేదు.

ఒరిజినల్ సినిమా అసురన్ ను మక్కికిమక్కి దింపేసిన నారప్ప సినిమాను.. వయసుమళ్ళిన నారప్పగా వెంకటేష్ నటన వంక పెట్టలేం.

సినిమా: నారప్ప
తారాగణం: వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: శ్యామ్ కె నాయుడు
నిర్మాత: డి సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
స్ట్రీమింగ్: అమెజాన్ ప్రైమ్
విడుదల తేదీ: జూలై 20, 2021

రేటింగ్: 2.75/5

 

More

Related Stories