నాట్యం – తెలుగు రివ్యూ

Natyam

డాన్స్ వచ్చని సినిమా తీయకూడదు. డాన్స్ కోసం సినిమా తీయాలి. మనకు తెలిసిన డాన్స్ సినిమాకు యాడ్ అవ్వాలి. శాస్త్రీయ నృత్యంపై మనకున్న ప్యాషన్ సినిమాలో కనిపించాలి. అప్పుడు మాత్రమే ఆ సినిమా నిలబడుతుంది. ఈ చిన్న లాజిక్ ను నాట్యం సినిమా మేకర్స్ మిస్సయ్యారు. సంధ్యారాజుకు నాట్యం తెలుసు కాబట్టి ఈ ”నాట్యం” తెరపైకొచ్చింది. అంతేతప్ప, నాట్యం కోసం ఈ సినిమా రాలేదు.

శాస్త్రీయ నృత్యమే ప్రధానాంశంగా ఒకప్పుడు స్వర్ణకమలం, మయూరి, సాగరసంగమం లాంటి సినిమాలొచ్చాయి. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయో ఆ ప్రభావం సినిమాపై కూడా గట్టిగా పడింది. ఇండియాలో లైఫ్ స్టైల్ మారడమే కాదు, సినిమా తీత కూడా మారిపోయింది. అలా శాస్త్రీయ నృత్యం ఆధారంగా సినిమాలు రావడం ఆగిపోయాయి. మళ్లీ ఇన్నేళ్లకు ఆ జానర్ లో సినిమా రావడం, సెలెబ్రిటీలు తెగ ప్రోమోట్ చెయ్యడంతో ఎక్కువ అంచనాలు, ఆశలు ఏర్పడ్డాయి. ఐతే, ఈరోజు థియేటర్లలోకి వచ్చిన తర్వాత అది ఆశ కాదని, కేవలం అపోహ మాత్రమేననే విషయం అర్థమవ్వడానికి అట్టే టైమ్ పట్టలేదు.

నాట్యం అనే చిన్న ఊరిలో ఈ కథ మొదలవుతుంది. ఆ ఊరిలో ఔత్సాహికులకు శాస్త్రీయ నృత్యం నేర్పిస్తుంటారు గురువుగారు (ఆదిత్య మీనన్). అదే కళాక్షేత్రంలో పుట్టి పెరుగుతుంది సితార (సంధ్యా రాజు). చిన్నప్పట్నుంచి నాట్యం నేర్చుకున్న సితార ఎప్పటికైనా కాదంబరి కథతోనే అరంగేట్రం చేయాలనుకుంటుంది. గురువుకు మాత్రం అది ఇష్టం ఉండదు. ఆమెను తప్పించి, చాలామందికి అరంగేట్రానికి అవకాశం ఇస్తుంటాడు.

ఇలా ఓవైపు సితార స్ట్రగుల్ అవుతుంటే, మరోవైపు తన డాన్స్ కాంపిటిషన్ కు కాన్సెప్ట్ కోసం సితార ఊరికి వస్తాడు రోహిత్ (రోహిత్ బెహల్). సితార టాలెంట్ కు ముగ్దుడైన రోహిత్.. ఆమెతో డాన్స్ చేస్తాడు. ఓ సందర్భంలో అనుకోకుండా సితార-రోహిత్ ముద్దుపెట్టుకుంటారు. నాట్యం అపవిత్రం చేసిందని భావించిన గ్రామస్తులు సితారను బహిష్కరిస్తారు. అలా ఊరి నుంచి బయటకొచ్చిన సితార, తిరిగి తన ఊరిలోకి ఎలా ప్రవేశించింది? కాదంబరి కథతో ఎలా అరంగేట్రం చేసింది? కాదంబరి కథకు ఆ ఊరికి సంబంధం ఏంటి? అనేది మిగతా స్టోరీ.

ఇలాంటి ట్విస్టులు, లింకులు సినిమాలో చాలా ఉన్నాయి. కానీ వాటిని సరైన క్రమంలో ఆసక్తికరంగా చెప్పలేకపోయాడు దర్శకుడు రేవంత్ కోరుకొండ. భారతీయ సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలు, ఆలయాల్లో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఎలా తగ్గిపోతున్నాయనే అంశాల్ని చర్చించిన ఈ సినిమా మరీ పేలవంగా సాగుతుంది. 30 ఏళ్ల కిందటి రొటీన్ స్క్రీన్ ప్లేలో నడుస్తుంది.

కొన్ని డాన్స్ ఎపిసోడ్స్ మినహాయిస్తే, మిగతా సినిమా మొత్తం మన సహనానికి పరీక్ష పెడుతుంది. సాగదీత సన్నివేశాలు, బోర్ కొట్టించే సీన్లు ఈ సినిమాను వెనక్కి లాగేస్తాయి. సంధ్యారాజు, రోహిత్ బెహల్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ చాలు, ఈ సినిమా రైటింగ్ ఎంత నాసిరకంగా ఉందో చెప్పడానికి.

ఈ సినిమాకు స్క్రిప్ట్‌, కెమెరా, ఎడిటింగ్‌, ద‌ర్శ‌కత్వం లాంటి కీలకమైన బాధ్యతలన్నింటినీ తానొక్కడే మోసిన రేవంత్.. కొన్ని బాధ్యతలు తగ్గించుకొని స్క్రిప్ట్, డైరెక్షన్ పై మరింత బాగా వర్క్ చేసి ఉండాల్సింది. అప్పుడీ ”నాట్యం” కొంత మెరుగ్గా ఉండేది.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు డాన్స్ బేస్డ్ గా వచ్చిన ఈ నాట్యంలో సంధ్యారాజు నాట్యాన్ని వంక పెట్టడానికేం లేదు. ఆమె తన పార్ట్ చక్కగా పెర్ఫార్మ్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కమల్ కామరాజు కూడా చక్కగా డాన్స్ చేశాడు. స్వతహాగా డాన్సర్ అయిన రోహిత్ కూడా డాన్స్ బాగా చేశాడు కానీ తన పేలవమైన నటనతో చిరాకు తెప్పించాడు. భానుప్రియ, ఆదిత్యమీనన్, శుభలేఖ సుధాకర్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం అదిరిపోయాయి. సంధ్యారాజు ఈ సినిమాకు నిర్మాత కూడా కావడంతో, తన డెబ్యూ కోసం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టారు. ఆ రిచ్ నెస్ సినిమాలో కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రవణ్ భరధ్వాజ్ మ్యూజిక్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడు ఈ సినిమాకు ఎక్కువ కష్టపడ్డాడు. శివుడి పాటతో పాటు, పోనీ-పోనీ సాంగ్ హైలెట్స్ గా నిలుస్తాయి.

ఫైనల్ టాక్:
ఓవరాల్ గా “నాట్యం” సినిమాలో టైటిల్ కు తగ్గట్టు నాట్యం ఉంది కానీ ఆసక్తికరమైన కథనం మాత్రం లేదు. ఫలితంగా ఇది మన సహనానికి పరీక్ష పెడుతుంది.

Rating: 1.75/5

– ‘పంచ్’ పట్నాయక్

Advertisement
 

More

Related Stories