
‘జాతిరత్నాలు’ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ యువ హీరో కరోనా కాలంలో తన అభిమానులకు అండగా నిలుస్తున్నాడు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయిన అభిమానులతో వీడియో కాల్ లో మాట్లాడుతున్నాడు నవీన్ పోలిశెట్టి.
ఇటీవల సాయి స్మరణ్ అనే నవీన్ పోలిశెట్టి అభిమాని తండ్రి కరోనాతో కన్నుమూశారు. సాయి స్మరణ్ తల్లి ఈ బాధతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆమె మనసు వేరే పనుల మీదకు మరల్చేందుకు “జాతిరత్నాలు” సినిమాను తల్లికి చూపించాడు సాయి స్మరణ్. ఆ సినిమా చూస్తూ మనసు తేలిక చేసుకుందా తల్లి. ఈ విషయాన్ని నవీన్ పోలిశెట్టికి ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు సాయి స్మరణ్.
నవీన్ పోలిశెట్టి వెంటనే మదర్ తో ఫోన్ లో మాట్లాడి ఓదార్చారు. ప్రియమైన వారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తను ఊహించగలనని, ఇలాంటి కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని చెప్పారు.