
హీరోయిన్ నయనతార దర్శకుడు విగ్నేష్ తో చాలా ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. అందులో రహస్యం లేదు. ఇద్దరూ ఇప్పటికే ప్రకటించారు తాము కాబోయే భార్యాభర్తలమని. వారి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది.
ఐతే, ఇటీవల వారిద్దరికీ పెళ్లి కూడా అయిందని ప్రచారం మొదలైంది. నయనతార ఇటీవల విగ్నేష్ తో కలిసి ఒక దేవాలయం వెళ్ళింది. అక్కడ పూజారి ఇచ్చిన కుంకుమని తన నుదుటపై పెట్టుకొంది. పెళ్ళైన స్త్రీలు తమ పాపిట మొదలయ్యే చోట కుంకుమ ధరిస్తారు. అది పెళ్ళికి గుర్తు. దక్షిణాదిలో ఈ సంప్రదాయం పెద్దగా లేదు.
కానీ నయనతార అలా కనిపించడంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారని అభిమానులు భావిస్తున్నారు. కానీ, అలాంటిదేమి లేదని నయనతార టీం చెప్తోంది. రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నయనతారకి లేదని అంటోంది.

ఇద్దరూ కలిసే ఉంటున్నారు. తమ మధ్య సంబంధాన్ని దాచడం లేదు. అలాంటప్పుడు పెళ్లి రహస్యంగా ఎందుకు చేసుకుంటారు? ఇది కూడా కరెక్ట్ అనిపిస్తోంది. మరోవైపు, నయనతార, సమంత, విజయ్ సేతుపతి మెయిన్ లీడ్ లో విగ్నేష్ తాజాగా ‘కన్మణి రాంబో కతిజ’ అనే ప్రేమకథాచిత్రాన్ని తీశాడు. అది వచ్చేనెల విడుదల కానుంది.