
నయనతార, దర్శకుడు అట్లీ మధ్య మాటల్లేవు అని ఈ మధ్య ప్రచారం మొదలైంది. “జవాన్” సినిమా విడుదలైన తర్వాత నయనతార అలిగింది అనేది పుకారు. ఎందుకంటే, ఆ సినిమాలో నయనతార పాత్ర కన్నా దీపికా పదుకోన్ పాత్రే హైలెట్ అయింది.
దీపికకి గెస్ట్ రోల్, తనకి మెయిన్ హీరోయిన్ రోల్ అని చెప్పి దర్శకుడు అట్లీ మోసం చేశాడని నయనతార భావించిందని సోషల్ మీడియాలో, మీడియాలో ఒకటే హోరెత్తించారు. దానికి తగ్గట్లే ఆమె “జవాన్” సినిమా సక్సెస్ మీట్ కి హాజరు కాలేదు.
అలాగే ఈ రోజు అట్లీ బర్త్ డే. పుట్టిన రోజు కూడా ఆమె అట్లీకి విషెష్ చెప్పలేదు అంటూ మరింతగా పుకార్లు లేపారు. ఐతే, గురువారం సాయంత్రానికి అందరి నోళ్లు మూతబడ్డాయి. ఎందుకంటే ఆమె అట్లీకి బర్త్ డే విషెష్ చెప్పడమే కాదు “జవాన్” షూటింగ్ ఫోటోలు కూడా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది.
షారుక్ ఖాన్ నటించిన “జవాన్” భారీ విజయం సాధించింది. నయనతారకి ఇది మొదటి బాలీవుడ్ చిత్రం. అట్లీ మొదటి సినిమా “రాజా రాణి”లో నయనతార హీరోయిన్. ఇక బాలీవుడ్ లో తన మొదటి చిత్రానికి కూడా ఆమె హీరోయిన్ గా ఉండాలని పట్టుబట్టి నయనతారని నటింపచేశాడు అట్లీ. కానీ, “జవాన్” విడుదల తర్వాత ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి అని పుకారు పుట్టించారు. ఇప్పుడు అన్నిటికి చెక్ పడింది.