
పవన్ కళ్యాణ్ అగ్ర హీరో. అలాంటి పెద్ద హీరో సరసన పెద్ద హీరోయిన్ లనే తీసుకోవాలనుకుంటారు దర్శకులు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్, రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, ప్రభాస్ సరసన దీపిక… ఇలా ఉంది పెద్ద హీరోల జోడి. కానీ, పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీసే దర్శకులు మాత్రం పెద్ద హీరోయిన్లవైపు చూడడం లేదు.
నిధి అగర్వాల్, శ్రీలీల, ప్రియాంక వంటి అప్ కమింగ్ హీరోయిన్లనే తీసుకుంటున్నారు. ‘హరి హర వీర మల్లు’ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. రెండేళ్లుగా ఆమె ఈ సినిమాతో బిజీగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లతో దర్శకుడు సముద్రఖని తీస్తున్న సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకి హీరోయిన్ అవసరం లేదు. సో, తీసుకోలేదు.
దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో తీస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఒక భామగా శ్రీలీల తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీలీలకి బాగా క్రేజున్న మాట వాస్తవమే. కానీ ఆమె ఇంకా పెద్ద హీరోయిన్ అనిపించుకోలేదు.
త్వరలో స్టార్ట్ కానున్న ‘ఓజీ’ అనే సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటించనుంది. ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించిన ఈ భామకి అసలు క్రేజ్ లేదు. బిజీ కాదు.
ఐతే, పవన్ కళ్యాణ్ అటు రాజకీయంగా బిజీగా ఉంటూ సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఆయన ఘాటింగ్ షెడ్యూల్స్ మాటిమాటికీ మారుతాయి. అందుకే, పెద్ద హీరోయిన్లని తీసుకోవడం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్స్ అడ్జెస్ట్ చేయగలిగే భామలను తీసుకుంటున్నారు. ఈ మొత్తం సెటప్ లో ఒక్క శ్రీలీల మాత్రం ఫుల్ బిజీ.