
నితిన్ నటిస్తే ఇప్పటికీ అతడి యాక్టింగ్ లో పవన్ కల్యాణ్ మేనరిజమ్స్ కనిపిస్తాయి. మరి నిఖిల్ నటిస్తే ఎలా ఉంటుంది? తన యాక్టింగ్ లో రవితేజ ఛాయలు ఉంటాయని ఒప్పుకున్నాడు ఈ హీరో. దీనికి సంబంధించి ఓ గమ్మత్తైన విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు
“చాలామంది దర్శకులు నా దగ్గరకు వచ్చేవాళ్లు. వాళ్లు నా కోసం వచ్చేవారు కాదు. రవితేజలా నేను నటిస్తాను కాబట్టి, అలానే చేయమని అడుగుతూ వచ్చేవారు. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే.. రవితేజ కాల్షీట్లు దొరకనివాళ్లు, రవితేజ కథల్ని రిజెక్ట్ చేసినవాళ్లు నా దగ్గరకు వచ్చేవాళ్లు. యంగ్ రవితేజలా నటించాలని అడిగేవారు.”
ఇలా కెరీర్ స్టార్టింగ్ లో రవితేజ రిజెక్ట్ చేసిన కథలన్నీ తనకే వచ్చేవనే విషయాన్ని బయటపెట్టాడు నిఖిల్. తనపై రవితేజ-పవన్ కల్యాణ్ ప్రభావం బాగా ఎక్కువని చెబుతున్నాడు.
“నాకు పవన్ కల్యాణ్, రవితేజ చాలా ఇష్టం. ఆ టైమ్ లో వాళ్లు యూత్ ఐకాన్. తెలియకుండానే నాపై వాళ్ల ప్రభావం ఉంది. దాదాపు స్వామిరారా సినిమా వరకు నా యాక్టింగ్ లో పవన్, రవితేజ కనిపిస్తారు. నా నటన నుంచి వాళ్లను తీసేయడానికి టైమ్ పట్టింది. వాళ్లలా కాకుండా క్యారెక్టర్ లా బిహేవ్ చేయడం నేర్చుకున్నాను.”
త్వరలోనే దర్శకుడిగా కూడా మారతానంటున్నాడు నిఖిల్. చిన్న పిల్లలతో ఓ ప్రయోగాత్మక చిత్రం తీస్తానంటున్నాడు.