స్పై – తెలుగు రివ్యూ

- Advertisement -
Nikhil Siddharth and Iswarya Menon

“స్పై” సినిమా ప్రచారం మొత్తాన్ని సుభాష్ చంద్రబోస్ చుట్టూ తిప్పారు. టీజర్ ను కూడా నేతాజీ స్మారకం వద్ద రిలీజ్ చేశారు. ఆ తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ లో నేతాజీ డెత్ సీక్రెట్ గురించే ఎక్కువగా మాట్లాడారు. ఇలా నేతాజీ ఎలిమెంట్ ను ఫుల్ గా క్యాష్ చేసుకుంటూనే, సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ ఇవ్వాలనుకున్నారు. నిజంగానే కథాపరంగా ఇది పాన్ ఇండియా సినిమానే. లొకేషన్ల పరంగా (శ్రీలంక, జోర్డాన్, నేపాల్, కజికిస్థాన్) చూసుకుంటే ఇది ఏకంగా పాన్ వరల్డ్ సినిమా అవుతుంది. అయితే కథనం, టేకింగ్ పరంగా చూసుకుంటే, ఇది పక్కా గల్లీ సినిమా.

“స్పై” సినిమాలో ఎలాంటి థ్రిల్ కనిపించదు. సుభాష్ చంద్రబోస్ ఎలిమెంట్ ను కేవలం హైప్ కోసం వాడుకున్నారనే విషయం సినిమా చూస్తే అర్థమౌతుంది. పరమ రొటీన్ స్క్రీన్ ప్లే, నీరసంగా సాగే నేరేషన్ కలిగిన ఈ 2 గంటల 15 నిమిషాల సినిమా.. 3 గంటలకు పైగా సినిమాను చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది.

గూఢచారి సినిమాలకు అడివి శేష్ ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ఆ మార్క్ ను ఏ దశలోనూ అందుకోలేక, పూర్తిస్థాయిలో చతికిలపడిన గూఢచారి సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు.

పాకిస్థాన్ ఉగ్రవాది (నితిన్ మెహతా) భారత్‌పై అణుదాడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. బోస్ (ఆర్యన్ రాజేష్), ‘రా’ టీమ్ అతనిని ట్రాక్ చేసి ఉరితీస్తారు. అయితే, చనిపోయిన ఉగ్రవాది కొన్నాళ్ల తర్వాత మళ్లీ ప్రత్యక్షమౌతాడు. అది ఎలా సాధ్యమైంది? జై (నిఖిల్ సిద్ధార్థ్), వైష్ణవి (ఈశ్వర్య మీనన్), కమల్ (అభినవ్ గోమతం) ఒక టీమ్ గా ఏర్పడి, ఈ టెర్రరిస్టును పట్టుకోవడానికి మిషన్‌ స్టార్ట్ చేస్తారు. దీంతో పాటు తన అన్నయ్య బోస్ ను చంపింది ఎవరో తెలుసుకోవడం జై వ్యక్తిగత మిషన్. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీకి, జై మిషన్ కు ఏంటి సంబంధం? వీటి అన్నింటినీ జై ఎలా సాల్వ్ చేశాడు అనేది స్థూలంగా కథ.

ఇలా కథగా చెప్పుకుంటే గ్రాండ్ గానే అనిపిస్తుంది. కానీ దానికిచ్చిన ట్రీమ్ మెంట్ మాత్రం నాసిరకంగా ఉంది. హీరో సీరియస్ గా మిషన్ గురించి ఆలోచిస్తుంటే, పక్కనే ఉన్న మరో ఏజెంట్ కుళ్ళు జోకులు వేస్తుంటాడు. అతను ఏజెంటా లేక “ధూమ్” సినిమాల్లో ఉదయ్ చోప్రాలా జోకరా అనేది అర్థం కాదు.

ఇక కథలో లేయర్స్ విషయానికొస్తే, ఎలాంటి సస్పెన్స్-థ్రిల్ కనిపించదు. అందుకేనేమో ఆఖరి నిమిషంలో కథకు నేతాజీ ఎలిమెంట్ జోడించారు. అన్నట్లు ఈ కథని రాసింది ఎవరో కాదు… దీన్ని నిర్మించిన నిర్మాత రాజశేఖర్ రెడ్డినే. మరో రైటర్ కథ చెప్పి తనను బురిడీ కొట్టించకుండా తనకు తానే చేసుకున్నాడన్నమాట . అతను ఏం ఊహించుకొని ఈ కథను తెరపైకి తీసుకురావాలనుకున్నాడో అర్థంకాదు. దారితెన్నూ లేకుండా సాగే కథకు, భావోద్వేగం లేని సన్నివేశాలు, డైరెక్షన్ లేని డైరెక్షన్ \ యాడ్ అయితే ఎలా ఉంటుందో స్పై సినిమా అలా ఉంది.

నేతాజీ డెత్ మిస్టరీకి సంబంధించిన ఎలిమెంట్స్ తప్పింతే, స్పై సినిమా మొత్తాన్ని సామాన్య ప్రేక్షకుడు ఇట్టే ఊహించుకోవచ్చు. చక్కగా సీట్ లో కూర్చొని పాప్ కార్న్ నములుతూ, నెక్ట్స్ వచ్చే సీన్ ఇది అని అలవోకగా చెప్పేయొచ్చు. ఓ 10 హాలీవుడ్ స్పై సినిమాల్లోంచి సన్నివేశాలు ఏరుకొచ్చి, గుదిగుచ్చి తెలుగులో స్పైగా తీసినట్టు అనిపించింది. ఇలా ఎత్తిపోతలు చేయడం తప్పుకాదు, దాన్ని సమర్థంగా అనుకరించడం అవసరం. ఈ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. చివరికి రానా (గెస్ట్ పాత్రలో) నటించిన చిన్న సీన్ కూడా చిరాకు తెప్పిస్తుంది.

ఎలాంటి ఎమోషన్ లేదా దేశభక్తిని క్యారీ చేయని ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంది. కార్తికేయ-2లో నిఖిల్ ఎలా కనిపించాడో, ఇందులో కూడా అలానే ఉన్నాడు. చేతిలో గన్ అదనం. అభినవ్ గోమటం పాత్ర ద్ద మైనస్. ఐశ్వర్య మీనన్, ఆర్యన్ రాజేష్, సాన్యా ఠాకూర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మకరంద్ దేశ్ పాండే ఎప్పట్లానే ఓవరాక్షన్ చేశాడు.

ఓవరాల్ గా ఓ గూఢచారి సినిమా ఎలా ఉండకూడదో “స్పై” సినిమా అలా ఉంది. బోర్ కొట్టించే ఈ సినిమాకు మైలేజీ తీసుకురావడం కోసం నేతాజీ ఎలిమెంట్ ను యాడ్ చేశారు తప్ప, కథకు దీనికి ఎలాంటి సంబంధం లేదు.

బాటమ్ లైన్: డైరక్షన్ లేని స్పై

Rating: 2/5

By M Patnaik

ALSO READ: Spy review: A boring mission!

 

More

Related Stories