నిఖిల్ కి రిలీజ్ టెన్షన్!


కరోనా కారణంగా సినిమాలు విడుదల చెయ్యలేక కన్ఫ్యూజన్ లో పడ్డారు పెద్ద హీరోలు, నిర్మాతలు. ఐతే, ఇలాంటి టైంలో కూడా బాలకృష్ణ డేర్ చేసి ‘అఖండ’ విడుదల చేసి ఘన విజయం సాధించారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ చేసి నార్త్ ఇండియాలో కూడా హల్చల్ చేసిన విషయం తెలిసిందే. నాని ‘శ్యామ్ సింగ రాయ్’, నాగార్జున – నాగ చైతన్య ల ‘బంగార్రాజు’… ఇలా పలు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి.

కాకపోతే, పాన్ ఇండియా మార్కెట్ కావాల్సిన ‘రాధేశ్యామ్’, ‘ఆర్ ఆర్ ఆర్’, అలాగే పెద్ద సినిమాలైన ‘ఆచార్య’ వంటివి వాయిదా పడ్డాయి. చిన్న సినిమాలకు నిజం చెప్పాలంటే పోటీలేని ఈ టైమే కరెక్ట్. కానీ, హీరో నిఖిల్ సిద్ధార్థ్ కరోనా వల్ల తన సినిమాలను విడుదల చెయ్యలేక పోతున్నాను అని బాధపడుతున్నాడు.

“కెరియర్లపై కరోనా ఇంతా ప్రభావం చూపడం బాధేస్తోంది. అర్జున్ సురవరం విడుదల తర్వాత నాలుగు అద్భుతమైన స్క్రిప్టులు ఒప్పుకున్నా. ఆ సినిమాల మీద గట్టి నమ్మకంతో ఉన్నాను. కానీ విడుదల తేదీలు అగమ్యగోచరం పడ్డాయి. పరిస్థితులు చక్కబడాలని సినిమాల విడుదలలు సాఫీగా సాగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా,” అని ట్వీట్ చేశాడు.

నిజానికి అతను ధైర్యం చేసి తన ’18 పేజెస్’ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయొచ్చు. ఆయన సినిమాలకు తెలుగు మార్కెట్ చాలు. ఫిబ్రవరిలో నిజానికి పెద్ద సినిమాలు విడుదల కాబోవడం లేదు. “సరైన టైం” కావాలంటూ నిఖిల్ తన సినిమాలను వాయిదా వెయ్యడం కరెక్ట్. కరోనా పోయి… పరిస్థితులు చక్కబడితే పెద్ద సినిమాలు క్యూ కడుతాయి. అప్పుడు పెద్ద చిత్రాల కారణంగా థియేటర్లు దొరకవు.

కాబట్టి నిఖిల్ తనవి అద్భుతమైన స్క్రిప్టులు అని నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడే రిలీజ్ చేసి… థియేటర్లకు ఊపు తీసుకురావాలని కోరుకుందాం. ఆ ముందడుగు నిఖిల్ వేస్తాడని ఆశిద్దాం.

Advertisement
 

More

Related Stories