
తమ సినిమాను ఎవ్వరూ పైరసీ చేయొద్దని, ఒకవేళ పైరసీ చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ ప్రతి మూవీ యూనిట్ చెబుతుంది. ఓవైపు పైరసీ జరుగుతూనే ఉంటుంది. చర్యలు మాత్రం తూతూమంత్రంగా సాగుతుంటాయి. “నిశ్శబ్దం” విషయంలో కూడా ఇలానే జరుగుతుందని భావించింది ఓ లోకల్ ఛానెల్. కానీ కోన టీమ్ మాత్రం ఊరుకోలేదు. ఏకంగా కోటి రూపాయలు కట్టాలని నోటీసు ఇచ్చింది.
“నిశ్శబ్దం” సినిమా ఇలా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కు వచ్చిందో లేదో అలా హైదరాబాద్ కు చెందిన ఓ లోకల్ ఛానెల్ ప్రోమో రెడీ చేసింది. త్వరలోనే తమ సిటీ ఛానెల్ లో “నిశ్శబ్దం” సినిమా ప్రసారమౌతుందంటూ కొన్ని విజువల్స్ కూడా వాడింది. ఈ విషయం యూనిట్ దృష్టికి వెళ్లింది.
సదరు లోకల్ ఛానెల్ కు ఏకంగా కోటి 10 లక్షల రూపాయలు కట్టాల్సిందిగా నోటీసులు జారీచేసింది “నిశ్శబ్దం” యూనిట్. అంతేకాదు.. ఇదే ఇష్యూకు సంబంధించి 30 లక్షలు చెల్లించాల్సిందిగా అమెజాన్ ప్రైమ్ కూడా నోటీసులిచ్చింది.
ఇంతకుముందు “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. లోకల్ ఛానెల్ ఈ సినిమాను ప్రసారం చేసినందుకు గాను.. ఈటీవీ నోటీసులు పంపించింది. ఇప్పుడు “నిశ్శబ్దం” యూనిట్ కూడా అదే పద్ధతి ఫాలో అయింది.