నితిన్ సినిమాకి ముందే దెబ్బ!


నితిన్ నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. ఐతే, ఆ సినిమా దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి గతంలో ట్విట్టర్లో చేసిన హడావిడి ఇప్పుడు ఈ సినిమా మెడకు చుట్టుకొంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గెలిచిన సందర్భంలో ఆయన జగన్ ని పొగుడుతూ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ చాలా ట్వీట్లు వేశారు. అందులో తప్పు పట్టాల్సిందేమి లేదు. రాజకీయ పార్టీలపై ఎవరి అభిప్రాయం వారిది. ఐతే, ఆయన “కమ్మ”, “కాపు” కులాల వారిని బూతు మాటలతో తిడుతూ ఒక ట్వీట్ చేసినట్లుగా చెప్తున్నారు. ఆయన పాత ట్వీట్ స్క్రీన్ షాట్ ని ఇప్పుడు కొందరు బయటికి తీశారు. ఐతే, అది ట్వీట్ నిజం కాదని, కొందరు ఫోటోషాప్ లో సృష్టించారని దర్శకుడి వాదన.

నితిన్ కూడా అదే చెప్తున్నాడు. ఒకవేళ, ఆ ట్వీట్ నిజం కాకపోయినా ఆయన వేసిన ఇతర ట్వీట్స్ (అవి ఇంకా వున్నాయి) కూడా ఆయన కులాభిమానాన్ని చాటుతున్నాయి అని అంటున్నారు.

కమ్మ సామాజికవర్గం వారిలో ఎక్కువమంది తెలుగుదేశం పార్టీ అభిమానులుగా ఉన్నట్లే రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువమంది వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, వై.ఎస్.జగన్ అభిమానులే. అలా ఈ దర్శకుడు కూడా తన పార్టీ, తన కులాభిమానాన్ని శృతి మించేలా చాటుకున్నాడు అని అతని పాత ట్వీట్లను బట్టి అర్థమవుతోంది. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ‘ఇక వీసా తీసుకొని రావాలా’ అని వ్యంగ్యంగా ట్వీట్లు వేసిన స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి.

మొత్తమ్మీద, తెలుగుదేశం అభిమానులు ఈ సినిమా విడుదల సమయంలో వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడం ఖాయం. ఆ విధంగా నితిన్ కి ముందే దెబ్బ పడింది.

 

More

Related Stories