
‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా విడుదల వాయిదా పడింది. దాంతోపాటే, ‘రాధేశ్యామ్’ కూడా అదే బాటలో నడవనుంది అనేది ప్రచారం. ఐతే, మేకర్స్ మాత్రం అలాంటిదేమి లేదంటున్నారు. ముందు ప్రకటించిన జనవరి 14వ తేదీనే సినిమా విడుదలవుతుందట. ‘ప్రస్తుతానికి’ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదంటున్నారు.
ఐతే, ఇక్కడ గమనించాల్సిన అంశమేమిటంటే… ‘ప్రస్తుతానికి’. ఒకవేళ కోవిడ్ కేసులు మరింతగా పెరిగి మహారాష్ట్రలో కానీ, తెలంగాణాలో కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో కానీ థియేటర్లను మూసివేసే పరిస్థితి వస్తే డేట్ మారొచ్చు.
“ఆర్ ఆర్ ఆర్” జనవరి 7న విడుదల కావాలి. వాయిదా నిర్ణయం జనవరి 1న తీసుకున్నారు. అలాగే, ‘రాధేశ్యామ్’ మేకర్స్ కూడా జనవరి 7, 8వ తేదీన పరిస్థితిని చూసి అదే జనవరి 14నే విడుదల చెయ్యాలా లేదా వాయిదా వెయ్యాలా అనేది తేల్చుతారు.
ప్రభాస్, పూజ హెగ్డే నటించిన ఈ సినిమా 2018లో షూటింగ్ మొదలుపెట్టింది. 2022 సంక్రాంతికి కూడా విడుదల కాకపోతే… సినిమా కోసం తెచ్చిన ఫైనాన్స్ పై వడ్డీల భారం దెబ్బతీస్తుంది. అందుకే, విడుదల/వాయిదా విషయంలో మేకర్స్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు.