ఆ ఫార్ములా నుంచి తప్పుకున్న మరో ఓటీటీ సంస్థ

కరోనా/లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీ సంస్థలన్నీ సినిమాల్ని డైరక్ట్ గా స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టాయి. అలా థియేట్రికల్ సిస్టమ్ ను కాదని, చాలా సినిమాలు ఓటీటీలోకి నేరుగా వచ్చేశాయి. ఇప్పటికీ కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఓవైపు థియేటర్లు నడుస్తున్నప్పటికీ, మరోవైపు మంచి డీల్ సెట్ చేసుకొని ఓటీటీకి వెళ్లిపోతున్నాయి. అయితే భవిష్యత్తులో ఈ మోడల్ ఉండకపోవచ్చు.

డైరక్ట్ ఓటీటీ రిలీజ్ నుంచి ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ తప్పుకుంది. ఒకప్పుడు వరుసపెట్టి సినిమాల్ని ఓటీటీలో నేరుగా రిలీజ్ చేసిన ఈ సంస్థ, ఇప్పుడు థియేటర్లలో రిలీజైన సినిమాల్ని మాత్రమే కన్సిడర్ చేస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులకు నెట్ ఫ్లిక్స్ కూడా ఇదే బాటలోకి వచ్చింది.

తాజాగా ఈ లిస్ట్ లోకి సోనీ లివ్ కూడా చేరిపోయింది. మొన్నటివరకు కేవలం డైరక్ట్ ఓటీటీ రిలీజ్ సినిమాల్ని మాత్రమే తీసుకునేది ఈ ఓటీటీ సంస్థ. కాస్త డబ్బులు ఎక్కువ పెట్టి మరీ సినిమాల్ని తమ ఓటీటీలో డైరక్ట్ గా రిలీజ్ చేసింది. కానీ ఇప్పుడీ సంస్థ కూడా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ మోడల్ నుంచి తప్పుకుంది.

ప్రస్తుతానికి మార్కెట్లో జీ5 మాత్రమే డైరక్ట్ ఓటీటీ రిలీజ్ మోడల్ లో సినిమాల్ని కొంటోంది. త్వరలోనే ఈ కంపెనీ కూడా ఈ మోడల్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉంది. అదే కనుక జరిగితే, ఇకపై ప్రతి సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వాల్సిందే. ఆ తర్వాతే ఓటీటీలోకి.

Advertisement
 

More

Related Stories