నో పాలిటిక్స్ ప్లీజ్: సురేష్ బాబు

Suresh Babu

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి తెలుగు చిత్రపరిశ్రమ ప్రముఖులు స్పందించేందుకు ఇష్టపడడం లేదు. మంగళవారం ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుని మీడియా ప్రశ్నించగా… తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ రాజకీయ అంశాల్లో స్పందించదు అని చెప్పారు.

“రాజకీయాలకు సంబంధించి తెలుగు చిత్రసీమ ఎప్పుడూ కామెంట్ చెయ్యలేదు. ఇది మద్రాస్ లో చిత్ర సీమ ఉన్నప్పటి నుంచి అవలంభిస్తున్న వైఖరి. ఎవరైనా వ్యక్తిగతంగా ఏదైనా పార్టీకి సానుభూతిపరులుగానో, పార్టీకి సభ్యులుగానో ఉండొచ్చు. వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడొచ్చు. కానీ పరిశ్రమ ఎప్పుడూ రాజకీయాల, రాజకీయ పరిణామాలపై అభిప్రాయం చెప్పదు. నాకు ఒక నాయకుడు నచ్చొచ్చు, ఇంకో నాయకుడు నచ్చకపోవచ్చు. అది పూర్తిగా వ్యక్తిగతం. కానీ పరిశ్రమ మాత్రం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చెయ్యదు. ప్రాంతాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగానే ఉంటాం,” అని సురేష్ బాబు అన్నారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా పరిశ్రమ ఎలాంటి వ్యాఖ్యలు, అభిప్రాయాలు చెప్పలేదు అన్నారు సురేష్ బాబు.

సురేష్ బాబు కుటుంబానికి చాలా ఏళ్లుగా టీడీపీతో అనుబంధాలు ఉన్నాయి. ఆయన తండ్రి రామానాయుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా కూడా చేశారు. ఐతే, అది వ్యక్తిగతం అని అంటున్నారు సురేష్ బాబు. పరిశ్రమ తరఫున మాత్రం తాను ఏ రాజకీయ పార్టీకీ అనుకూలంగా, వ్యతిరేకంగా మాట్లాడలేను అని చెప్పారు.

Advertisement
 

More

Related Stories