
జూనియర్ ఎన్టీఆర్ మరోసారి టార్గెట్ అయ్యారు టీడీపీకి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రకటన చేశారు. అది తెలుగుదేశం పార్టీ నేతలకి, స్వర్గీయ ఎన్టీ రామారావు అభిమానులకు నచ్చలేదు. నచ్చకపోవడం వరకు ఐతే ఒకే. కానీ ఏకంగా తిడుతున్నారు. అదే ఇప్పుడు జూనియర్ అభిమానులను కలవరపరుస్తోంది.
విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుని మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీఆర్ పేరు బదులు వైఎస్సార్ పేరుని పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇది పెద్ద దుమారమే రేపింది. ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ అభిమానులు, ఇతర పార్టీలు గట్టిగా విమర్శలు చేశారు. జూనియర్ కూడా ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపారు.
కానీ, ఎన్టీఆర్ ప్రకటన కొంచెం డిప్లమాటిక్ గా ఉంది. ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ గొప్పవారు అని, ఒకరి పేరు తీసి ఇంకొకరు పేరు పెట్టడం మంచిది కాదన్నట్లుగా సున్నితంగా ఉంది ఎన్టీఆర్ విమర్శ. కానీ, ఇది నందమూరి అభిమానులకు, టీడీపీ వాళ్లకు నచ్చలేదు. తాజాగా నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. కుక్కలు, పీతలు అంటూ విమర్శించారు బాలయ్య.

అప్పటి నుంచి జూనియర్ ని టార్గెట్ చేస్తూ పలువురు టీడీపీ నాయకులు తిడుతున్నారు. వాళ్ళని తిడుతూ జూనియర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మొత్తమ్మద, జూనియర్ ఎన్టీఆర్ కి, టీడీపీకి రోజురోజుకీ గ్యాప్ పెరుగుతోంది. అంతేకాదు, ఆ మధ్య బీజేపీ నాయకుడు అమిత్ షాని కలవడం తెలంగాణ రాష్ట్ర సమితికి నచ్చలేదు. అటు టీడీపీకి, ఇటు తెరాసకి దూరమయ్యాడు జూనియర్ ఎన్టీఆర్.