
కృతి సనన్ ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్. ఐతే, ఆమె హీరోయిన్ గా అడుగుపెట్టింది మాత్రం తెలుగులోనే. మహేష్ బాబు హీరోగా రూపొందిన “1 నేనొక్కడినే” ఆమెకి నటిగా మొదటి చిత్రం. అలాగే ఆమె చెల్లెలు నుపుర్ సనన్ కూడా తెలుగులోనే మొదట నటించింది.
నుపుర్ సనన్ నటించిన తొలి చిత్రం… టైగర్ నాగేశ్వరరావు. రెండు రోజుల క్రితం (అక్టోబర్ 20) విడుదలైంది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో నుపుర్ సారా అనే పాత్రలో నటించింది. కేవలం ఫస్ట్ హాఫ్ లో మాత్రమే కనిపిస్తుంది నుపుర్. చిన్న పాత్ర, ఒక పాట దక్కింది ఆమెకి. ఐతే ఈ సినిమాలో ఆమె నటన అక్క నుపుర్ కి నచ్చిందిట.
“కళ్ళు భావాలు పలికించే వేళ… చాలా గర్వంగా ఉంది నుపుర్… ఎంత కాన్ఫిడెంట్ గా రంగప్రవేశం చేశావు…,” అంటూ తన సోదరిని కృతి ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రశంసించింది.
“టైగర్ నాగేశ్వరరావు” చిత్రం విడుదలకు ముందే ఈ భామ తెలుగులో మంచు విష్ణు సరసన రెండో చిత్రం సైన్ చేసింది. కానీ ఆ వెంటనే తప్పుకొంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక మూవీ చేస్తోంది. మరి తెలుగులో మళ్ళీ అవకాశాలు వస్తాయా అనేది చూడాలి.