
ఒక్క నవల … ఒక డజన్ చిత్రాలకు కారణమైంది. ఆ నవల హక్కులు తీసుకొని కొందరు తీస్తే… మరికొందరు “లేపేసి” తమ కథ అని జనాలకు వడ్డించారు. అది ఒక జపాన్ నవల. “ది డివోషన్ అఫ్ సస్పెక్ట్ ఎక్స్” (The Devotion of Suspect X) అనే నవల 2005లో విడుదలైంది. కీగో హీగాసినో (Keigo Higashino) రాశారు. విడుదలైన వెంటనే పాపులర్ అయింది.
ఆ నవల ఆధారంగా జపాన్ లో మొదట ఒక సినిమా తీశారు. 2008లో విడుదలైంది ఆ చిత్రం. ఇక 2012లో కొరియాలో “పర్ఫెక్ట్ నంబర్” పేరుతో మరో సినిమా వచ్చింది.
కొరియన్ చిత్రాన్ని కాపీ కొట్టి మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ “దృశ్యం” పేరుతో సినిమా తీశారు. అదే సినిమా తెలుగులో, తమిళ్ లో, కన్నడలో, హిందీలో రీమేక్ అయింది. ఆ తర్వాత 2019లో తమిళంలో “కొలైగరను” పేరుతో కూడా ఆ నవల స్ఫూర్తిగా తీశారు.
ఆ తర్వాత చైనాలో, హాలీవుడ్ లో కూడా సినిమాలు వచ్చాయి ఇదే నవల ఆధారంగా.
ఇప్పుడు హిందీలో “జానే జాన్” అని సినిమా వచ్చింది. కరీనా కపూర్ హీరోయిన్ గా దర్శకుడు సుజయ్ ఘోష్ (“కహాని” చిత్ర దర్శకుడు) ఈ సినిమాని తీశారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. మలయాళ దర్శకుడు కాపీ కొట్టి తీస్తే సుజయ్ ఘోష్ నవల హక్కులు కొని మరీ తీశారు.
మొత్తమ్మీద, ఒక నవల దాదాపు 12 చిత్రాలకు కారణమైంది అంటే దాని గొప్పతనం ఏంటో తెలుస్తోంది కదా.