ఆన్లైన్ టికెటింగ్… ఇదే ఫైనల్

- Advertisement -
Cinema Theaters

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన నిర్మాతలు, థియేటర్ యజమానులు ఈ రోజు అమరావతిలో భేటీ అయ్యారు. ఆన్‌లైన్‌ టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వం పట్టుబడుతోంది. దానికి తెలుగు చిత్రసీమ ప్రతినిధులు కూడా అంగీకారం తెలిపారట. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి రాష్ట్రంలో ఆన్లైన్ వ్యవస్థ ద్వారా టికెట్లు అమ్మకం ఉంటుంది అని స్పష్టం చేశారు.

టికెట్ రేట్లు కూడా పారదర్శకతతో ఉండేలా చూస్తాం అన్నారు. ప్రభుత్వ నిర్దేశించిన ధరలకే టికెట్లు అమ్మేలా ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను తెస్తున్నామని చెప్పారు. “నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్‌ యజమానులు చెప్పిన సూచనలు, విషయాలు పరిగణనలోకి తీసుకుంటున్నాం. సాధ్యమైనంత మేర సానుకూలంగా స్పందించాం,” అని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. అలాగే సెకండ్ షోకి అనుమతి లేదు. 100 శాతం ఆక్యుపెన్సీ, సెకెండ్ షో లకు అనుమతి ఇవ్వాలని, అలాగే టికెట్ రేట్లను ఫ్లెక్సీ రేట్లుగా రూ.50 నుంచి 250 మధ్యన ఉండేలా చూడాలని సినిమా ప్రతినిధులు కోరారు. ఆ విషయం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి వివరించి ఓ నిర్ణయం తీసుకుందామని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే… ప్రభుత్వం ముందునుంచి అంటున్నట్లుగానే ఆన్లైన్ లో టికెట్ల అమ్మకం ఉంటుంది. టికెట్ రేట్స్ విషయంలో ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పిస్తుంది. ఇక ఇదే ఫైనల్.

 

More

Related Stories