ఓటీటీ సినిమాల బలమింతేనా?

ఓటీటీ Vs థియేటర్స్ అనుకున్నారంతా. కానీ రోజులు గడిచేకొద్దీ ఓటీటీ అసలు రంగు బయటపడుతోంది. నికార్సైన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ లాక్ డౌన్ టైమ్ లో రాలేదు.

ఏప్రిల్ నెల నుంచి చూసుకుంటే.. ఈ 6 నెలల్లో నేరుగా ఓటీటీలో రిలీజైన సినిమా ఒక్కటి కూడా క్లిక్ అయిన దాఖలాల్లేవు. అలా రిలీజైన సినిమాల కంటే ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ లే ఎక్కువగా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

’47 డేస్’, ‘అమృతారామమ్’, ‘జిప్సీ’, ’36 వయసులో’, ‘పెంగ్విన్’, ‘పవర్ స్టార్’, ‘పరాన్నజీవి’, ‘యారా’, ‘జోహార్’, ‘బుచ్చిన్నాయుడు కండ్రిగ’, ‘సడక్-2’, ‘అమరం అఖిలం ప్రేమ’.. ఇలా ఈ 5-6 నెలల కాలంలో వచ్చిన సినిమాలేవీ ఆకట్టుకోలేకపోయాయి. పైపెచ్చు మరింత నిరాశపరిచాయి.

చివరికి భారీ అంచనాలతో వచ్చిన ‘V’, ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘నిశ్శబ్దం’.. లాంటి సినిమాలు కూడా ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు అందర్లో అనుమానాలు పెరిగాయి. ఉన్నంతలో “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య”, ‘గుంజన్ సక్సేనా’, ‘దిల్ బేచారా’ లాంటి సినిమాలు ఆకట్టుకున్నప్పటికీ ఫ్లాప్ అయిన సినిమాల కౌంటే ఎక్కువగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది.

థియేట్రికల్ గా ఆడదనే ఉద్దేశంతో ఇలా కొన్ని సినిమాల్ని ఓటీటీకి ఇచ్చేస్తున్నారా లేక గత్యంతరం లేక ఓటీటీకి ఇచ్చిన తర్వాత ఈ సినిమాలన్నీ డిసప్పాయింట్ చేస్తున్నాయా అనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్ గా మారింది. ఏదేమైనా ఓటీటీలో నేరుగా రిలీజైతే సినిమాలో పస ఉండదనే అభిప్రాయం మాత్రం జనాల్లోకి వెళ్లిపోయింది. కనీసం రాబోయే సినిమాలైనా ఈ అభిప్రాయాన్ని మారుస్తాయేమో చూడాలి. 

Related Stories