ఒటిటి సినిమా: నయట్టు (మలయాళం)

Nayattu

రీసెంట్ గా మలయాళ సినిమా రంగం నుంచి గొప్ప సినిమాలు, వైవిధ్యమైన చిత్రాలు వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ పుణ్యమా అని ఇప్పుడు మనం అందరం వాటిని చూడగలుగుతున్నాం. లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్ అందుబాటులోకి తెచ్చిన మరో మంచి మలయాళ చిత్రం.. “నయట్టు”.

“నయట్టు” అంటే వేట అని అర్థం. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. ప్రవీణ్ మైఖేల్, మణియన్, సునీత అనే ముగ్గురు పొలిసు అధికారులు ఒకే స్టేషన్ లో పని చేస్తుంటారు. ఒక రోజు ఓ పెళ్లి రిసెప్సన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఆక్సిడెంట్ జరుగుతుంది. ముగ్గురూ ఒకే జీపులో  ఉంటారు. వీరి జీపుని నడిపేందుకు కుదుర్చుకున్న డ్రైవర్ ప్రమాదం జరగ్గానే పారిపోతాడు. ఆ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని వీరు అదే జీపులో ఆసుపత్రికి తీసుకెళ్తారు. కానీ అతను అప్పటికే చనిపోతాడు. ఆ చనిపోయిన వ్యక్తి దళితుడు. పైగా అధికార పార్టీకి చెందిన కార్యకర్త.

రాజకీయ ఒత్తిడి కారణంగా పొలిసు ఉన్నతాధికారులు తమ ముగ్గురిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని వారు గ్రహిస్తారు. కొన్నాళ్ళు ఎక్కడైనా తలదాచుకునేందుకు మున్నార్ పారిపోతారు. అది ఉప ఎన్నికల టైం. స్వయంగా ముఖ్యమంత్రి ఈ కేసులో ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. దాంతో… ఈ ముగ్గురు పొలీసు ఆఫీసర్లు తాము చెయ్యని తప్పుకు బలి కాబోతున్నామని గ్రహిస్తారు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది కథ.

పొలీసు వ్యవస్థ, కులాల కుంపటి, రాజకీయ కంపు… వీటి చుట్టూ అల్లుకున్న డ్రామా ఇది. ఆద్యంతం ఆసక్తి రేపుతుంది. అందరి నటన ఎంత నేచురల్ గా ఉంటుంది అంటే నిజంగా కళ్ళముందే కథ నడుస్తున్నంతగా. మార్టిన్ ప్రకట్ అనే యువ దర్శకుడు తీసిన నాలుగో చిత్రమిది.

ఈ సినిమా రైటర్ షాహి కబీర్ ఇంతకుముందు “జోసెఫ్” అనే సినిమాకి కథ ఇచ్చాడు. “జోసెఫ్”ని తెలుగులో “శేఖర్” పేరుతో రాజశేఖర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. సాహి కబీర్ స్వయంగా కేరళ పోలీస్ యంత్రాంగంలో పని చేస్తున్నాడు. సో… అతని పొలీసు కథలు చాలా సహజంగా ఉంటాయి.​ ​”నయట్టు” కూడా అంతే గ్రిప్పింగ్ గా సాగింది.
అలాగే, ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఓపెన్ ఎండెడ్. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది ప్రేక్షకుడి ఊహకే వదిలేస్తారు దర్శక, రచయితలు. 

చూడండి నెట్ ఫ్లిక్స్ లో 

Advertisement
 

More

Related Stories